అమెరికా 500 శాతం పన్ను… భారత్ ఏమంటోంది?

అమెరికా తీసుకోబోతున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఇండియాను టెన్షన్ పెడుతోంది. రష్యా దగ్గర నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొంటున్న దేశాలపై కక్ష్యతో 500 శాతం పన్నులు వేసే బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. దీనిపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందిస్తూ తాము పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా కూడా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. దీనివల్ల పుతిన్ యుద్ధం చేయడానికి కావాల్సిన నిధులు అందుతున్నాయని అమెరికా భావిస్తోంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ సమ్మతితో అమెరికా సెనేటర్ లిండ్సే ఈ కఠినమైన బిల్లును ముందుకు తెచ్చారు.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ తమ దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయులకు అనువైన ధరలకే ఇంధనం అందించడం తమ ప్రాథమిక బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టే భారత్ తన విధానాలను నిర్ణయించుకుంటుందని స్పష్టం చేశారు.

ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికాకు ఒక పెద్ద అస్త్రం దొరికినట్టే అని సెనేటర్ గ్రాహం అన్నారు. భారత్, చైనా వంటి దేశాలు రష్యా ఆయిల్ కొనకుండా చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల రష్యాకు అందుతున్న ఆర్థిక వనరులను దెబ్బకొట్టవచ్చని అమెరికా అంచనా వేస్తోంది.

ఈ బిల్లును అమెరికా తన పరపతిని పెంచుకోవడానికి ఒక సాధనంగా వాడుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు చౌకగా రష్యా ఆయిల్ కొనకుండా ఒత్తిడి పెంచడం దీని లక్ష్యం. వచ్చే వారం దీనిపై ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

ప్రస్తుతానికి భారత్ ఈ పరిణామాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. తమ ఇంధన అవసరాల కోసం గ్లోబల్ మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. మరి అగ్రరాజ్యం ఒత్తిడికి భారత్ లొంగుతుందా లేక తన స్వయం ప్రతిపత్తిని చాటుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.