రాజధాని ఎఫెక్ట్: వైసీపీలో చీలిక?

వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం జగన్‌తో తీవ్రంగా విభేదిస్తోంది. రాజధాని అమరావతిని కాదన్న నాటి నుంచి ఈ ప్రాంతంలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం జగన్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాంతంలోనే మెజారిటీ అసెంబ్లీ సీట్లు ఉండడం గమనార్హం.

రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దాంతో భూముల ధరలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్‌తో పాటు అనేక రంగాల్లో వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెంది, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ అంశాన్ని రెడ్డి సామాజిక వర్గంతో పాటు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం కూడా బలంగా నమ్ముతోంది. అయితే ఈ విషయంపై జగన్ ఇప్పటికీ తన పాత వైఖరినే కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీయడంతో వైసీపీపై నమ్మకం మరింత తగ్గుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు కూడా అనేక మంది రెడ్డి నాయకులు వైసీపీకి దూరమయ్యారు. దీనికి ప్రధాన కారణంగా రాజధాని అమరావతిపై జగన్ వైఖరినే పేర్కొంటున్నారు. నెల్లూరు నుంచి కృష్ణా వరకు పలువురు కీలక నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ప్రజల అభిప్రాయాలకు విలువ లేనప్పుడు పార్టీలో కొనసాగి నష్టపోవడం ఎందుకన్న భావన వారిలో ఏర్పడింది.

ఇది వైసీపీకి అప్పట్లోనే పెద్ద దెబ్బగా మారింది. ఇప్పుడు కూడా జగన్ వైఖరిలో మార్పు కనిపించకపోవడం, అమరావతిపై అక్కసును కొనసాగించడం వల్ల భవిష్యత్తులో ఈ ప్రభావం మరింత పెరుగుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఓటమి ఎదురైనప్పటికీ, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింత చేదుగా మారుతుందన్న భయంతో కొందరు నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇప్పటికే చాలామంది నేతలు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరిలో మార్పు తెస్తారేమో అన్న ఆశతో కొందరు ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో వైసీపీలో చీలిక వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.