నేషనల్ హైవే నిర్మాణంలో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు రాష్ట్రం వేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. బెంగళూరు -కడప- విజయవాడ ఎకనామిక్ కారిడార్లను కలిపే 28.95కి.మీ రహదారిని 24గంటల్లోనే నిర్మించారని తెలిపారు. దీనికోసం 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ వాడకం మరో రికార్డు అన్నారు. భారత ప్రభుత్వ, కేంద్ర మంత్రి గడ్కరీ విజన్, ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీమ్స్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.
బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ (ఎన్‌హెచ్–544జి)పై జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 24 గంటల వ్యవధిలో ఈ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది.
ఈ అపూర్వ విజయానికి భారత ప్రభుత్వ దూరదృష్టి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రపంచ స్థాయి రహదారి మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ బృందాలు చూపిన అంకితభావం, కృషి ఈ రికార్డులకు బాట వేసిందన్నారు. నిబంధనలకు అనుగుణంగా, ఎన్‌హెచ్‌ఏఐ కఠిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఈ పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ఇదే కారిడార్‌లోని ప్యాకేజీలు–2, 3లపై జనవరి 11, 2026 నాటికి మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates