తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ ఆమోదించలేదు.
ఈ క్రమంలోనే మండలి సమావేశాల్లో సోమవారంనాడు పాల్గొన్న కవిత..తన తండ్రి కేసీఆర్ పై, సోదరుడు కేటీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, మండలి సమావేశాలు ముగిసిన వెంటనే కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించిన వైనం చర్చనీయాంశమైంది.
గత ఏడాది సెప్టెంబరు 3వ తేదీన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ ను కోరారు. భావోద్వేగంతో తీసుకున్న రాజీనామా నిర్ణయంపై పునరాలోచించాలని కవితను మండలి ఛైర్మన్ కోరారు.
అయితే, తాను తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనని ఆమె చెప్పారు. దీంతో, కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
అయితే, ఇన్నాళ్లూ కవిత రాజీనామాను ఆమోదించని ఛైర్మన్ నేడు ఆమోదించడంపై చర్చ జరుగుతోంది. మండలి సమావేశాల సందర్భంగా కవితకు మాట్లాడే ఛాన్స్ దక్కాలన్న ఉద్దేశ్యంతోనే రాజీనామాను ఆమోదించలేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో కవిత చేరతారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కవితకు మండలిలో చివరిసారిగా మాట్లాడే చాన్స్ ఇవ్వాలని ఇన్నాళ్లూ వెయిట్ చేశారని పుకార్లు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates