పోలవరం పరుగులు పెడుతుందండోయ్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు, వేగం పుంజుకున్నాయి. గత 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులు 13 శాతం మేర పూర్తికాగా, మొత్తం నిర్మాణం ఇప్పటివరకు 87.8 శాతానికి చేరుకుంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే సివిల్ పనులు 72 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.

అయితే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాలనలో కనీసం 2 శాతం పనులు కూడా ముందుకు సాగలేదని వెల్లడించారు. ఈ లోటును పూరించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 పనులను సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

అదే విధంగా నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతినీ ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మిగిలిన పనులను వేగవంతం చేసే అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు.