ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఏడాదిలో తొలిసారి బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో అధికారులు వివరించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో బాబు భేటీకానున్నారు. అయితే.. ఈ పర్యటనలో ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమిత్‌షా అప్పాయింట్‌మెంటు మాత్రమే ఖరారైనట్టు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు.. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో కేంద్ర హోం శాఖ నుంచి రావాల్సిన అనుమతులు వంటి విషయాలపై చర్చించారు.
ముఖ్యంగా ఈ సారి ఢిల్లీ పర్యటనలో వచ్చే వార్షిక బడ్జెట్‌లో ఏపీకి కేటాయించాల్సిన నిధులపైనే చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు ఈ దఫా 2026-27 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు ఉండేలా.. చర్చించనున్నారు.
అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన పోలీసు స్టేషన్లు.. ముఖ్యంగా రాష్ట్రంలో కొరతగా ఉన్న ఐపీఎస్ అధికారుల కేటాయింపు వంటి అంశాలు ఈ పర్యటనలో కీలకంగా మారనున్నాయి. ఇటీవల కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు. పోలవరం, మార్కాపురం జిల్లాలకు ఐపీఎస్ అధికారులను కేటాయించాల్సి ఉంది.
దీనికితోడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా ఐపీఎస్ అధికారుల కొరత వెంటాడుతోంది. అలాగే.. రాష్ట్రంలో కొత్త పోలీసు స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. వీటికి సంబంధించిన విషయాలపై కేంద్ర హోం శాఖతో చర్చించాల్సి ఉందని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త ఏడాదిలో తొలిసారి ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను మర్యాద పూర్వకంగా కలుసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. బుధవారం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు.. గురువారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates