ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన విషయం బయటపడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) విడుదల చేసిన కొత్త డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఏకంగా 2.89 కోట్ల మంది పేర్లు మాయమయ్యాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత ఈ భారీ ప్రక్షాళన జరిగింది. ఇంతకుముందు 15.44 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 12.55 కోట్లకు పడిపోయింది.
ఈ తగ్గింపు ఎంత భారీగా ఉందంటే, మొత్తం ఓటర్లలో దాదాపు 18.7 శాతం మంది పేర్లు గల్లంతయ్యాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ప్రతి ఐదుగురు ఓటర్లలో ఒకరి పేరు లిస్ట్ నుంచి ఎగిరిపోయింది. ఇలాంటి భారీ మార్పు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఇంతమందిని ఎందుకు తొలగించారు అనే సందేహం మీకు రావచ్చు. దీనికి అధికారులు పక్కా లెక్కలు చెప్పారు.
చనిపోయిన వారు సుమారు 46.23 లక్షల మంది, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారు ఏకంగా 2.17 కోట్ల మంది ఉన్నారు. ఇక ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం వల్ల 25.46 లక్షల మంది పేర్లను తొలగించారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదు. ఒకవేళ అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున పోయి ఉంటే, వాటిని మళ్ళీ చేర్పించుకోవచ్చు. దీనికోసం జనవరి 6 నుంచి ఫిబ్రవరి 6 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ సమయం ఇచ్చారు.
ఫార్మ్ 6 నింపి, తగిన ఆధారాలు చూపిస్తే మళ్ళీ ఓటు హక్కు పొందవచ్చు. కేవలం ఉత్తర ప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. ఇటీవల తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్ లో 74 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇలాగే తగ్గించారు. అలాగే అస్సాం లో కూడా 10.56 లక్షల పేర్లను లిస్ట్ నుంచి తీసేశారు. బోగస్ ఓట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఈసీ ఈ పని చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates