గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భస్రావాలు, రక్తహీనతకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనేమియాను ఎదుర్కొనే దిశగా అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించనున్నారు. ఈ భవనంలో అవసరాలకు అనుగుణంగా రక్త నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేసి, పూర్తి అయిన అనంతరం అరకు ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేయనున్నారు.
‘అడవితల్లి బాట’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా కురిడీ గ్రామంలో నిర్వహించిన మాటా–మంతి కార్యక్రమంలో ఓ గిరిజన మహిళ సికిల్ సెల్ ఎనేమియా కారణంగా ఎదురవుతున్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జన్యుపరంగా వచ్చే ఈ వ్యాధి గర్భిణుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని వివరించగా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని పవన్ కళ్యాణ్ అప్పుడే హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు వైద్య నిపుణులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ఉప ముఖ్యమంత్రి, రక్త మార్పిడి ద్వారా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చన్న సూచనలతో బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 మంది సికిల్ సెల్ ఎనేమియా బాధితులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates