మందుబాబులూ…సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!

మందుబాబులం మేము మందుబాబులం…మందుకొడితె మాకు మేమె మహారాజులం…నిజంగానే చాలామంది మందుబాబులు మందేయగా ఇలాగే ఫీలవుతుంటారు. అందుకే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగానే…మా నాన్నఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా? ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ…అంటూ ట్రాఫిక్ పోలీసులను, పోలీసులను బెదిరిస్తుంటారు. అయితే, ఇకపై అలా బెదిరించే బిల్డప్ బాబాయ్ ల ఆటలు చెల్లవంటున్నారు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్.

వీసీ సజ్జనార్ పోలీసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. సోషల్ మీడియాలో, మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్…తన మార్క్ పోలీసింగ్ తో పాపులర్ అయ్యారు. ఆ కోవలోనే మందుబాబులకు సజ్జనార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడ్డ తర్వాత మా డాడీ ఎవరో తెలుసా..అంకుల్ ఎవరో తెలుసా..అన్న ఎవరో తెలుసా…అని తమ పోలీసు ఆఫీసర్లను అడగొద్దని సజ్జనార్ అంటున్నారు.

అదే సమయంలో తాము వారి ప్రైవసీకి భంగం కలగనివ్వబోమని, గౌరవిస్తామని చెబుతున్నారు. కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం బండి పక్కన పెట్టి, కేసు డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం అంటున్నారు సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే హైదరాబాద్ పోలీసులు అస్సలు సహించరని, జీరో టాలరెన్స్ అని చెప్పారు.

మోతాదుకు మించి డ్రింక్ చేస్తే స్టీరింగ్ పట్టుకోకూడదని, క్యాబ్ ను పిలవాలని అంటున్నారు. ఆ సమయంలో గూగుల్ లో క్యాబ్ అని వెతకాలని, లాయర్ అని కాదని చెప్పారు. ముఖ్యంగా, డిసెంబరు 31, జనవరి 1వ తేదీన న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. అందుకే, సజ్జనార్ ముందస్తుగానే తనదైన శైలిలో మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సజ్జనార్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.