2025: ఏపీకి పెట్టుబ‌డుల సంవత్సరమే.. !

సాధార‌ణంగా.. ఏ రాష్ట్రానికైనా పెట్టుబ‌డులు వ‌స్తాయి. కానీ.. ఏపీ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. 2025లో మెజారిటీ పార్ట్ అంతా కూడా.. పెట్టుబ‌డుల చుట్టూనే తిరిగింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి.. న‌వంబ‌రు వ‌ర‌కు ప్ర‌ధానంగా పెట్టుబ‌డుల కోసం సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు విస్తృతంగా ప‌ర్య‌టించారు. రాష్ట్రం లో 20 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగాల క‌ల్ప‌న‌ను ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న ద‌రిమిలా..దానిని సాధించేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. పెట్టుబ‌డుల‌పై ప‌ట్టు సాధించారు.

ప్ర‌ధానంగా విశాఖ‌లో గూగుల్ డేటా కేంద్రంతోపాటు.. టీసీఎస్ కేంద్రాల‌కు అంకురార్ప‌ణ జ‌రిగింది కూడా ఈ సంవ‌త్స‌రంలోనే. త‌ద్వారా ల‌క్ష మందికి ఉపాధి ల‌భించ‌నుంది. అదేవిధంగా అమెరికా, స్విట్జ‌ర్లాండ్, సింగ‌పూర్‌, దుబాయ్‌లకు చెందిన ప‌లు ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌ను ఆహ్వానించి పెట్టుబ‌డులు పెట్టే క్ర‌మంలో దూసుకుపోయారు. ఈ క్ర‌మంలోనే దుబాయ్‌కు చెందిన లూలూ కంపెనీ విశాఖ‌లో మాల్ నిర్మించేందుకు గ‌తంలో చేసుకున్న ఒప్పందాన్ని తిరిగి గాడిలో పెట్టింది.

అలానే.. పెట్టుబ‌డులు పెట్టి.. ఉపాధి, ఉద్యోగాలు క‌ల్పించే సంస్థ‌ల‌కు ఈ ఏడాది భారీ రాయితీలు ఇచ్చా రు. అంతేకాదు.. వారికి ఎస్క్రో అకౌంట్ సౌల‌భ్యాన్ని క‌ల్పించిన ఏకైన రాష్ట్రంగా కూడా.. ఏపీ అవ‌త‌రించింది. ఇక‌, క్వాంట‌మ్ కంప్యూటింగ్ స‌హా బ్యాంకుల ఏర్పాటు విష‌యంలోనూ ఈ ఏడాది కీల‌క అడుగులు ప‌డ్డాయ‌నే చెప్పాలి. ప్ర‌ధానంగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌తో ఉద్యోగాల క‌ల్ప‌న‌, ఆరు వేల మంది కానిస్టేబుళ్ల నియామ‌కంతో హోం శాఖ బ‌లోపేతం వంటివిఈ ఏడాది క‌లిసి వ‌చ్చిన అంశాలు.

ప్ర‌ధానంగా ఈ ఏడాది జ‌రిగిన అన్ని కేబినెట్ స‌మావేశాల్లోనూ పెట్టుబ‌డుల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించారు. పెట్టుబ‌డి సంస్థ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు భారీ రాయితీలు కూడా ప్ర‌క‌టించారు. టీసీఎస్ స‌హా.. ప‌లు సంస్థ‌ల‌కు అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే భూములు కేటాయించారు. త‌ద్వారా.. పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోతాయ‌ని అనుకున్న సంస్థ‌లు కూడా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయి. మొత్తంగా ఈ ఏడాది 23 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు సాధించిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఇక‌, వీటిని ఏర్పాటు చేసేందుకు కూడా ప్ర‌భుత్వం స్వ‌యంగా చ‌ర్య‌లు ప్రారంభించింది.