కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టిడిపిలో 2025 సంవత్సరం ఏవిధంగా గడిచింది? నాయకులు ఏ విధంగా వ్యవహరించారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే జిల్లాకు ఒక రకంగా నాయకులు అడుగులు వేశారు. రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే నాయకుల దూకుడు పెరిగింది. గత ఎన్నికల్లో వైసిపి ఇక్కడ బలమైన ప్రాతినిథ్యం సంపాదించుకోలేని కారణంతో టిడిపి విజయం దక్కించుకుంది. దీంతో టిడిపి నాయకులు రెచ్చిపోయారని చెప్పాలి. వాస్తవానికి ఒక ఎన్నికల్లో విజయమే ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మారదని ఎవరూ చెప్పలేరు. దీనిని బట్టి ప్రజలకు చేరువ కావాలి. ప్రజల్లో మంచిని సంపాదించుకోవాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి. అయితే, ఈ విషయంలో టిడిపి నాయకులు ఒకింత వెనకబడ్డారని చెప్పాలి. చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రమే వారు ప్రజల మధ్యకు వచ్చారు… తప్ప వ్యక్తిగతంగా ప్రజల మధ్యకు వెళ్ళిన రాయలసీమ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు.
ఇక ఉమ్మడి ప్రకాశంలో నాయకత్వం అంతర్గత విభేదాలు వివాదాలతో ముందుకు సాగింది. ముఖ్యంగా కూటమిలోనే కొంతమంది నాయకులతో టిడిపి నాయకులు విభేదించారు. కొందరు సర్దుకు పోయారు. దీంతో గ్యాప్ అయితే కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లే విషయంలోనూ ప్రకాశం నెల్లూరు జిల్లాలో నాయకులు వెనుకబడ్డారు అన్నది ప్రభుత్వమే చెప్పిన మాట.
ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ నాయకుల మధ్య సమన్వయం ఉన్నప్పటికీ చిన్న చిన్న వివాదాలు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున అయితే టిడిపికి డామేజ్ అయ్యే పరిస్థితి లేదు. ఉత్తరాంధ్రలోనూ నాయకుల మధ్య సమన్వయం ఉంది. కాకపోతే అక్కడ కొద్దిపాటి ఆరోపణలు, ముఖ్యంగా ఇసుక వంటి విషయాల్లో నాయకుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక అన్నిటికన్నా ప్రధానమైన విజయవాడలో ఎంపీ-తిరువూరు ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదం టీడీపీని కుదిపేసింది.
అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి -కడప బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య కొనసాగుతున్న వివాదాలు టిడిపిని ఇరుకున పెట్టాయి. మొత్తంగా చూస్తే 2025లో టిడిపి చిన్న చిన్న వివాదాలు తప్ప మిగిలిన విషయాల్లో కలిసిమెలిసి ఉందనే చెప్పాలి. అదేవిధంగా బలమైన పార్టీగా పుంజుకుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates