రేవంత్ గ్రాఫ్.. 2025లో కీల‌క ఘ‌ట్టాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా.. బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి.. ఈ ఏడాది కీల‌క ఘ‌ట్టాల‌తో త‌న గ్రాఫ్‌ను పెంచుకున్నారు. ముఖ్యంగా నాలుగు అంశాల్లో ఆయ‌న వెరువకుండా దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇది ఆయ‌న‌కు విజ‌యాల‌ను దూసుకువ‌చ్చింది. బ‌ల‌మైన ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల్లో గ్రాఫ్ పెంచేలా కూడా చేసింది.

1) హైడ్రా: మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌డం సంక‌ల్పంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి హైడ్రాను దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. కోర్టుల నుంచి ఆక్షేప‌ణ‌లు వ‌చ్చినా.. ఒకానొక ద‌శ‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌చ్చినా.. వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలో మూసీ ప‌రివాహ‌క అభివృద్ధికి క‌ట్టుబ‌డిన తీరును స్ప‌ష్టం చేసింది.

2) ఫ్యూచ‌ర్ సిటీ, పెట్టుబ‌డులు: ఈ ఏడాది ఈ రెండు విష‌యాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి ప‌క్కా ప్లాన్‌తో వ్య‌వ‌హ‌రించారు. ఫ్యూచ‌ర్ సిటీ వంటి మ‌హానగ‌రానికి ప్రాధాన్యం ఇచ్చారు. అదేస‌మ‌యంలో ఫార్మా స‌హా సెమీకండెక్ట‌ర్ ప్రాజ‌క్టుల‌కు పెద్ద‌పీట‌వేశారు. అదేవిధంగా 2047 నాటికి రైజింగ్ తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌న్న సంక‌ల్పం పెట్టుకున్నారు. ఇటీవ‌ల కూడా పెట్టుబ‌డుల స‌ద‌స్సును నిర్వ‌హించారు. వీటితో పాటు.. హైద‌రాబాద్ న‌గ‌రం గురించి.. ప్ర‌పంచ దేశాల‌కు తెలిసేలా..ప్ర‌పంచ సుందరుల పోటీకి ఆతిథ్యం ఇచ్చారు. అలానే.. న‌గ‌రాన్ని విస్త‌రించ‌డం.. జోన్లుగా వ‌ర్గీక‌రించ‌డం ద్వారా అభివృద్ధికి పెద్ద‌పీట వేశారు.

3) కుల‌గ‌ణ‌న‌: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారు చేప‌ట్టిన కుల గ‌ణ‌న ఈ ఏడాది పెద్ద సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి. రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. తొలిసారి.. కుల‌గ‌ణ‌న‌ను చేప‌ట్ట‌డం ద్వారా బీసీల సంఖ్య‌ను తేల్చారు. తెలంగాణ స‌మాజంలో 43 శాతం మంది బీసీలు ఉన్నార‌ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి.. వారికి 43 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నుంచే దీనిని అమ‌లు చేయాల‌ని భావించినా.. రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ ల నుంచి ఈబిల్లుకు ఆమోదం పొంద‌లేదు. అయితే.. రాజ‌కీయంగా మాత్రం అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావ‌డంలో రేవంత్ రెడ్డి స‌క్సెస్ అయ్యారు.

4) విజ‌యాలు: ఈ ఏడాది జ‌రిగిన రెండు కీల‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని విజ‌య తీరాల దిశ‌గా న‌డిపించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో విజ‌యంతోపాటు.. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 8 వేల మంది స‌ర్పంచుల‌ను గెలిపించుకోవ‌డం ద్వారా త‌న హ‌వాకు తిరుగులేద‌న్న వాద‌న‌ను రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు. ఇక‌, పార్టీలో చిన్న‌పాటి విభేదాలు.. మంత్రుల మ‌ధ్య చికాకులు వ‌చ్చినా.. వాటిని పెద్ద‌వి కాకుండా.. హెచ్చరించారు. ఎవ‌రినీ నొప్పించ‌కుండా.. ఇంటా బ‌య‌టా.. సీఎంగా రేవంత్ మంచి మార్కులు వేసుకున్నారు.