రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? అంటే ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన పరిణామాలు గమనిస్తే కూటమిలోని మూడు పార్టీలు బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పాలి. పార్టీ పరంగా పెట్టుకుంటున్న కార్యక్రమాలు భిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని కీలక అంశాల విషయంలో మాత్రం మూడు పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. మూడు పార్టీలది ఒకే మాట అన్నట్టుగా అడుగులు వేస్తున్నాయి. ఇది కూటమి బలోపేతానికి ప్రధానంగా పని చేస్తోంది. అదేవిధంగా పై స్థాయిలో నాయకుల మధ్య అవగాహన సమన్వయం స్పష్టంగా కనిపించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా టిడిపి అధినేత చంద్రబాబును ప్రశంసించడం అదేవిధంగా టిడిపి అధినేత చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్న మెచ్చుకోవడం వంటివి ఈ ఏడాది కనిపించాయి. ఇక, బిజెపి రాష్ట్రస్థాయి నాయకులకంటే కూడా జాతీయస్థాయి నాయకులను రాష్ట్రంలో హైలెట్ చేస్తూ వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నాయకత్వాన్ని కూడా సీఎం చంద్రబాబు తరచుగా ప్రశంసిస్తున్నారు. ప్రధానమంత్రిని అనేక సందర్భాల్లో ఆకాశానికి ఎత్తేసారు.
తద్వారా కూటమిలో బిజెపి రాష్ట్రస్థాయి నాయకత్వం ఎలా ఉన్నప్పటికీ జాతీయస్థాయి నాయకత్వాన్ని కలుపుకొని అడుగులు వేస్తున్నారు. ఇది, భవిష్యత్తు రాజకీయాలను బలోపేతం చేస్తుందని ముఖ్యంగా కూటమి రాజకీయాలను బలోపేతం చేస్తుందని సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోందిజ ఇక రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు కేంద్రం నుంచి సహకారం తీసుకువచ్చే విషయంలో కూడా చంద్రబాబు తరచుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు.
అదే సమయంలో కూటమి నాయకులకు నామినేటెడ్ పదవులు, మంత్రివర్గం విషయంలోనూ చేసిన ప్రయత్నాలు వంటివి సంతృప్తిని మిగులుస్తున్నాయి. ఇటు బిజెపికి అటు జనసేనకు సమన్వయంగా నామినేటెడ్ పదవులు సీఎం చంద్రబాబు ఇస్తున్నారు. తద్వారా అసంతృప్తి లేకుండా కూటమిలో సమన్వయాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది కూటమిని బలోపేతం చేసేందుకు భరోసా కల్పించేందుకు అవకాశంగా మారింది.
ఇక క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని జిల్లాల్లో విభేదాలు ఉన్నప్పటికీ వాటి విషయంలో సీరియస్ గా చర్యలు తీసుకోకుండా కేవలం హెచ్చరికలు చేసి సరిపెడుతుండడం ద్వారా నాయకత్వం… బెసిగిపోకుండా చూసుకుంటున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు కూటమిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయనే చర్చ నడుస్తోంది. ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కూటమి కార్యకలాపాలు సజావుగానే సాగుతున్నాయి.
ముఖ్యంగా ఇటీవల చేపట్టిన అటల్ -మోడీ సుపరిపాలన యాత్రలు మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించడం వంటివి బిజెపిని సంతృప్తి పరుస్తున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే ఇప్పటికే ప్రకటించిన నామినేటెడ్ పదవులు కూడా ఆ పార్టీలో జోష్‌ను నింపుతున్నాయి. మొత్తంగా కూటమి ఈ ఏడాది కాలంలో బలంగా ఉందనే వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates