టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు ఊహించని పదవి లభించింది. అది కూడా రాజ్యాంగబద్ధమైన పదవి కావడం గమనార్హం. సుప్రీంకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వాదనలు వినిపించేందుకు సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ పదవులు ఉన్నాయి. ఇవి రాజ్యాంగబద్ధమైన పదవులు.
వీటిలో తాజాగా అదనపు సొలిసిటర్ జనరల్ పదవికి కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘ అనుభవం ఉండడం.. రాజ్యసభ వ్యవహారాలు సహా న్యాయ, చట్ట నిబంధనలపై మంచి పట్టు ఉన్న నేపథ్యంలో కనకమేడలకు ఈ పదవి లభించింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. కేంద్ర, రాష్ట్రాల తరఫున సుప్రీంకోర్టులో కేసులపై వాదనలు వినిపిస్తారు.
బాబుకు అండగా..
కనకమేడల దాదాపు 30 సంవత్సరాలుగా టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయసేవలు కూడా అందిస్తున్నారు. గత వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో ఉంచినప్పుడు.. కనకమేడల న్యాయం పరంగా ఢిల్లీలో చక్రం తిప్పారు. కీలక న్యాయవాదులతో చర్చించడంతోపాటు.. చట్టంలో ఉన్న పాయింట్లను వెలికి తీసి..చంద్రబాబు బయటకు వచ్చేలా ప్రయత్నించిన వారిలో కనకమేడల కూడా ఒకరు.
అదేవిధంగా వైసీపీ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు.. వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, మద్యం వంటి అనేక అంశాలను రాజ్యసభలో ప్రస్తావించి.. కేంద్రం దృష్టికితీసుకువెళ్లేలా చేశారు. ఫలితంగా కనకమేడలకు ఉన్న అనుభవానికి తోడు.. చంద్రబాబుపై ఉన్న విధేయత కూడా కలిసి వచ్చి ఆయనకు పదవి దక్కేలా చేసింది.
ఉమ్మడి ఏపీ నుంచి..
జిల్లా కోర్టు న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కనకమేడల రవీంద్రకుమార్.. ఉమ్మడి ఏపీలో హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో కృష్ణానది జలాల వివాదం(మహారాష్ట్రతో) ఏర్పడినప్పుడు.. కనకమేడల రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించారు. అనంతరం రాజ్యసభ సభ్యత్వం పొందారు.
ఈ క్రమంలోనూ ఆయన లా అండ్ జస్టిస్‌పై కేంద్రం నియమించిన పార్లమెంటరీ స్థాయి సంఘానికి నేతృత్వం వహించారు. రాజ్యసభలోనూ ఉప చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. రాజ్యసభలో చర్చకు వచ్చే పత్రాలపై ముందస్తు పరిశీలన కమిటీకి కూడా బాధ్యత వహించారు. ప్రస్తుతం కనకమేడల వయసు 69 సంవత్సరాలు. మరో మూడేళ్లపాటు ఆయన అదనపు సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates