పవన్ వార్నింగులను వైసీపీ లెక్క చేస్తుందా?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీమళ్లీ వైసిపికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. నాలుగు రోజుల కిందట నిర్వహించిన కార్యక్రమంలో వైసిపి నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప లైన్లోకి రారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీనికి కొనసాగింపుగా మరోసారి సోమవారం నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసిపి నాయకుల వైఖరితో రాష్ట్ర అభివృద్ధి తగ్గిపోతుంది అని, పెట్టుబ‌డుల‌పై ప్రభావం పడుతుంది అని చెప్పారు.

ఇదే స‌మయంలో వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదని ఆ పార్టీ నాయకులను ఎలా లైన్లో పెట్టాలో తనకు తెలుసు అని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒకరకంగా చెప్పాలంటే వరుస హెచ్చరికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైసీపీ విషయంలో తీవ్రంగానే స్పందిస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

అయితే పవన్ కళ్యాణ్ హెచ్చ‌రికలను వైసిపీ నిజంగానే లెక్క చేస్తుందా? ఆ పార్టీ నాయకులు బెదిరిపోతారా? అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ భవిష్యత్తు రాజకీయాల్లో కూటమి నాయకుల మధ్య ఉన్న ఒక తరహా భయాన్ని అయితే తీసేసే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు తరచుగా చంద్రబాబు కంటే కూడా పవన్ వైసీపీను ఉద్దేశించి వ్యాఖ్యానించడం వెనక రాజకీయ వ్యూహం కూడా ఉంద‌ని అంటున్నారు. చంద్రబాబు వైసీపీ గురించి మాట్లాడితే ప్రజల్లో ఉండే స్పందన కంటే కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడితే వస్తున్న స్పందన విభిన్నంగా ఉంది.

పవన్ కళ్యాణ్ వైసీపీ గురించి మాట్లాడినప్పుడు యువతలో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. వైసీపీని హెచ్చరించినప్పుడు కూడా యువతలో ఎక్కువగానే రియాక్షన్ వచ్చింది. అదే టిడిపి అధినేత చంద్రబాబు స్పందిస్తే ఈ తరహా స్పందన అయితే కనిపించడం లేదన్నది విశ్లేషకుల మాట.

మొత్తంగా వైసీపీని త‌న హెచ్చ‌రిక‌ల ద్వారా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తున్నారు. కానీ, ఏ మేరకు వైసీపీ నాయకులు ఈ హెచ్చరికలకు లొంగుతారనేది చూడాలి. సహజంగానే పార్టీ అధినేతను బట్టి ఇట్లాంటి విషయాల్లో నాయకుల స్పందన ఆధారపడి ఉంటుంది. టిడిపిలో పార్టీ అధినేత చంద్రబాబు ఓరకంగా కొన్ని కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తారు. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, వైసిపి విషయానికి వస్తే ఆ త‌ర‌హా పరిస్థితి ఎక్కడా మనకు కనిపించదు.

పైగా మొండిగా ముందుకు వెళ్లడం జగన్ నైజానికి పెట్టింటి పేరు. సో మొత్తానికి హెచ్చరికలు పనిచేస్తాయా పని చేయవా అనేది ఇప్ప‌ట్లో చెప్పకపోయినా వైసిపి వ్యవహరిస్తున్న తీరులో కొంతవరకు మార్పు అయితే కనిపించే అవకాశం ఉంది.

ఒకప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున విరుచుకుపడిన నాయకులు ఇటీవల కాలంలో జోరును తగ్గించారు. అదేవిధంగా విమర్శలు కూడా తగ్గాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బెదిరింపులతో ఏ మేరకు వారు లైన్లోకి వస్తారు అనేది చూడాలి.