రెడ్డ‌మ్మ వ‌ర్సెస్ క‌ళావ‌తి.. మంత్రి పీఠం ఎవ‌రికి? వైసీపీ డిబేట్‌

జ‌గ‌న్ కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణకు ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతోంది. మ‌రో ప‌ది మాసాల్లోనే మంత్రి వ‌ర్గంలోని స‌గం మందిని మార్చేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో కొంద‌రు ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గ రేసులో దూకుడుగా ముందున్నారు. అయితే.. ఎలాంటి ప్ర‌య‌త్నాలూ లేకుండానే కొంద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేర్లు.. శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఇదే జిల్లాకు చెందిన పాల‌కొండ ఎమ్మెల్యే విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి. వీరిద్ద‌రూ కూడా వైఎస్ కుటుంబానికి స‌న్నిహితులే. మ‌రీ ముఖ్యంగా క‌ళావ‌తి వ‌రుస విజ‌యాల‌తో దూకుడుగా ఉన్నారు.

పార్టీ ప‌రంగా మంచి పేరు కూడా క‌ళావ‌తికి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇద్ద‌రూ సౌమ్యులు, వివాద ర‌హితులే కావ‌డం గ‌మ‌నార్హం. వీరిలో పాల‌కొండ ఎమ్మెల్యే ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డంతోపాటు.. జ‌గ‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే నాయ‌కురాలిగా ఎప్ప‌టి నుంచో పేరు తెచ్చుకున్నారు. 2014లో విజ‌యం సాధించిన క‌ళావ‌తికి.. టీడీపీ నుంచి తొలుత ఆహ్వానం అందింది. ఈ విష‌యాన్ని ఆమె అప్ప‌ట్లో స‌భ‌లోనే చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కోసం.. పార్టీ కోసం.. తాను వైసీపీని వీడేది లేద‌ని చెప్పుకొచ్చారు. పార్టీ గెలుపులోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో సమాంత‌రంగా తాను కూడా పాద‌యాత్ర చేశారు.

ఇక‌, రెడ్డి శాంతి కూడా పాత‌ప‌ట్నంలో వైసీపీ పునాదులు బ‌ల‌ప‌రుస్తున్నారు. ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన నిదుల‌తో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేస్తున్నారు. అయితే.. క‌ళావ‌తి సీనియ‌ర్ కావ‌డం.. గ‌త ఏడాది ప్ర‌భుత్వం ఏర్పాటు స‌మ‌యంలోనే ఆమె త‌న‌కు కేబినెట్లో చోటు ద‌క్కుతుంద‌ని ఆశించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్పుడు ఇద్ద‌రికీ అవ‌కాశం ఇస్తారా? లేక ఒక‌రికే స‌రిపెడ‌తారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ జిల్లా నుంచి ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజులు కొన‌సాగుతున్నారు. వీరిని అలాగే ఉంచుతార‌ని ప్ర‌చారంలో ఉంది.

ఇక‌, ఎస్టీ కోటాలో విజ‌యనగ‌రం జిల్లా కురుపాం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పుష్ప శ్రీవాణిని ప‌క్క‌న పెట్టి.. ఆ స్తానంలో క‌ళావ‌తికి అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. అయితే.. తాను బ‌ల‌మైన పాత‌ప‌ట్నంలో వైసీపీ జెండా పాతాన‌ని .. త‌న‌కు గుర్తింపు ఇవ్వ‌డం ద్వారా టీడీపీకి మ‌రింత చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని రెడ్డి శాంతి డిమాండ్‌గా వినిపిస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా.. వీరిద్ద‌రిలో ఎక్కువ మార్కులు క‌ళావ‌తికే ప‌డుతున్నాయి క‌నుక ఆమెకే కేబినెట్లో చోటు ద‌క్కుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.