ఏపీకి ప్రతిష్టాత్మకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా కూడా మారనున్న కీలక ప్రాజెక్టు పోలవరం. ఇది వచ్చే 2028 నాటికి తొలి దశ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఈ ప్రాజెక్టుపై తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు పేరు మార్చాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పోలవరం ప్రాజెక్టుకు పెట్టడం ద్వారా ఆయన త్యాగానికి ఒక ఫలితం ఇచ్చినట్టుగా అవుతుందని అన్నారు. ఆయనను చిరస్థాయిగా కొన్ని తరాల పాటు మననం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి పోలవరం ప్రాజెక్టు పేరును అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాజెక్టుగా మార్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ మేరకు పార్టీ నాయకులతో నిర్వహించిన పదవి బాధ్యత కార్యక్రమంలో సంచలన ప్రకటన చేశారు.
కాగా, పోలవరం ప్రాజెక్టుకు గతంలోనే ఒక పేరు ఉండేది. అది అనేక కారణాలతో మార్పు చెందింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనులు ప్రారంభించిన సమయంలో ఈ ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ అని పేరు పెట్టారు.
తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్థానికతకు పెద్దపీట వేస్తున్నామని, పోలవరం ప్రజలు, గిరిజనులు త్యాగం చేసిన భూములతో నిర్మిస్తున్నందున అదే పేరును కొనసాగిస్తామని పేర్కొంటూ ఇందిరా సాగర్ పేరును తీసేసి పోలవరం ప్రాజెక్టుగా పేరు మార్చి 2014 తొలినాళ్లలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి అలానే కొనసాగుతోంది.
మధ్యలో వైసీపీ ప్రభుత్వం దీనికి వైఎస్ ఆర్ ప్రాజెక్టుగా పేరు మార్చాలని చూసినా, స్థానికంగా కొందరు అడ్డు తగలడంతో వెనక్కి తగ్గింది.
కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాజెక్టుగా పేరు పెట్టాలని పవన్ పేర్కొనడం గమనార్హం. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కాసీతమ్మ పేరు పెట్టారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం సహా ఇతర వస్తువులు అందించే పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టారు. ఈ రెండూ పవన్ కళ్యాణ్ సూచనలే కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates