రఘురామ తగ్గట్లేదుగా..

వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ అధికారిక హోదాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు రెండు పేజీల లేఖ రాశారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను ఆయన పెన్ డ్రైవ్‌లో సమర్పించారు. ఇదే లేఖను రాష్ట్ర హోం శాఖ సెక్రటరీకి కూడా పంపించారు. తక్షణమే ఐపీఎస్ సునీల్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.

ఏం జరిగింది?

వైసీపీ హయాంలో రఘురామను (అప్పటి ఎంపీ) అరెస్టు చేయడం, కస్టడీలో హింసించారన్న ఆరోపణల నేపథ్యంలో రఘురామ (ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల విచారణకు కూడా సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ కేసు నేపథ్యంలోనే ప్రభుత్వం సునీల్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఇదిలా ఉండగా, సునీల్ కుమార్ ఇటీవల కాలంలో రఘురామను కూడా టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

తనపై ఉన్న కేసు నేపథ్యంలో విధుల నుంచి సస్పెండ్ చేసినట్టుగానే రఘురామపై కూడా సీబీఐ కేసులు ఉన్నాయని, అందువల్ల ఆయనను రాజకీయ పదవుల నుంచి (డిప్యూటీ స్పీకర్) తొలగించాలని కోరుతూ ఇటీవల సుదీర్ఘ సెల్ఫీ వీడియోను సునీల్ కుమార్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు.
“రఘురామ ఇప్పుడు కాకపోతే మరో రెండు మూడు రోజుల్లో అరెస్టు అవుతారు. ఇది ఏపీ బ్రాండ్ ఇమేజ్‌కు ఇబ్బందికరం. అందుకే ఆయనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలి” అని సునీల్ వ్యాఖ్యానించారు.

తాజాగా రఘురామ స్పందిస్తూ, డీజీపీకి ప్రధానంగా మూడు అంశాలపై ఇంగ్లీష్‌లో అధికారిక లెటర్ హెడ్‌పై లేఖ పంపించారు.

తనపై తప్పుడు ఆరోపణలు చేయడం

న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడం మరియు సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించడం

తనపై విచారణ కోరుతూ సీబీఐ కోర్టులో రిట్ పిటిషన్ వేస్తానని సునీల్ హెచ్చరించడం

ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐపీఎస్ సునీల్ కుమార్‌ను డిస్మిస్ చేయాలని రఘురామ కోరారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.