కేసీఆర్ కు వత్తాసు పలికిన వైసీపీ మాజీ మంత్రి

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు అతిగా పబ్లిసిటీ చేశారని, అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాపీ కొట్టారని సెటైర్లు వేశారు.

చంద్రబాబు చెప్పే లెక్కల ప్రకారం ఆయన ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలు సక్సెస్ అయితే ఏపీలో 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేవని అన్నారు. సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అదే మాదిరిగా తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్థిస్తున్నారు. కేసీఆర్ కామెంట్లకు వైసీపీ నేత, మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వత్తాసు పలికారు. పబ్లిసిటీ, మార్కెటింగ్, వైసీపీపై విమర్శలు చేయడం తప్ప ఏపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు.

ఆ విషయాన్నే కేసీఆర్ స్పష్టం చేశారని, తాను ఆయన వ్యాఖ్యలతో వ్యక్తిగతంగా తాను 100 శాతం ఏకీభవిస్తానని అన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడం తాను చూడలేదని, అందుకే ఆయన అంత పెద్ద నాయకుడయ్యాడని కితాబిచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోవాలని హితవు పలికారు.

ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు కేసీఆర్ అంతటి సత్యహరిశ్చంద్రుడు లేడు అని గుడివాడ అమర్నాథ్ సర్టిఫై చేయడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తా అన్న కేసీఆర్…పదేళ్ల ఆ కుర్చీ పట్టుకొని వేలాడిన విషయం అమర్నాథ్ మరిచిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇంతకన్నా పెద్ద అబద్ధాలు కేసీఆర్ ఎన్నో చెప్పారని, వాటి గురించి అమర్నాథ్ తెలుసుకోవాలని చురకలంటిస్తున్నారు.