డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్ పరిధిలో ఈ సేవలను అమలు చేస్తోంది. రైతు బజార్‌లో ఉన్న ధరలకే తాజా కూరగాయలు, పండ్లను వినియోగదారుల ఇంటి వద్దకే 30 నిమిషాల నుంచి గంటలోపు డోర్ డెలివరీ చేయనున్నారు. ఈ సేవల కోసం https://digirythubazaarap.com/ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు.
మాచింట్ సొల్యూషన్స్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ డిజిటల్ వేదిక ద్వారా వినియోగదారులు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్‌లైన్‌లో సరుకులను ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతి రోజు రైతు బజారులో అందుబాటులో ఉన్న పండ్లు, కూరగాయలు, వాటి ధరలు, స్టాక్ వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తారు. అదనపు డెలివరీ ఛార్జీలు లేకుండా, రైతు బజార్‌లో లభించే అసలు ధరలకే ఉత్పత్తులు అందించడం ఈ విధానం ప్రత్యేకత.
ప్రస్తుతం ఎంవీపీ కాలనీ రైతు బజార్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివసించే వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన వంటి అంశాలను పరిశీలిస్తూ పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు పూర్తిచేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష మార్కెట్ ఏర్పడటం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. మధ్యవర్తులు లేకపోవడంతో వినియోగదారులకు తక్కువ ధరలు, రైతులకు నేర లాభం చేకూరనుంది. పైలట్ దశ విజయవంతమైతే ఈ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఇతర రైతు బజార్లకు విస్తరించడంతో పాటు త్వరలో మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates