`టీజేపీ`… క‌విత పార్టీపై క‌స‌ర‌త్తు!?

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌విత తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలిగా ప్ర‌జ‌ల‌కు చేరువయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కొత్త రాజ‌కీయ‌ పార్టీ విష‌యంపై నోరు మెద‌ప‌ని ఆమె.. ఇక‌, స్వ‌యంగా ఇప్పుడు రాజ‌కీయ పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. తాజాగా ఆమె ఆ ప‌నిపైనే ఉన్నార‌ని తెలిసింది.

తెలంగాణ రాష్ట్ర‌స‌మితి(టీఆర్ఎస్‌)గా ఏర్ప‌డిన కేసీఆర్ పార్టీ ప్ర‌జ‌ల‌కు చేరువ అయింది. రాష్ట్ర పేరును పార్టీ పేరులో చేర్చ‌డం ద్వారా.. ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. అయితే.. రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. `టీ` తీసేసి.. భార‌త‌-`బీ`- రాష్ట్ర‌స‌మితిని ఏర్పాటు చేశారు. దేశ‌వ్యాప్తంగా చ‌క్రం తిప్పాల‌ని భావించారు. జాతీయ‌స్థాయిలో పుంజుకోవాలని అనుకున్నారు. కానీ, అప్ప‌టి నుంచి ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. తెలంగాణ పేరుతో కొత్త పార్టీలు పెద్ద‌గా లేవు. కోదండ‌రాం ఏర్పాటు చేసిన `తెలంగాణ జ‌న స‌మితి` పెద్దగా స‌క్సెస్ కాలేదు. గ్రామీణ ప్రాంతాల‌తో అస‌లు క‌నెక్ట్ కూడా కాలేదు. దీంతో తెలంగాణ అస్థిత్వాన్ని చాటేలా ఏ పార్టీ లేద‌నే చెప్పారు. ఈ నేప‌థ్యంలో క‌విత చాలా వ్యూహాత్మ‌కంగా తెలంగాణ అస్థిత్వాన్ని త‌న పార్టీలో చేర్చేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ జాగృతి సంస్థ‌నే రాజ‌కీయ‌ పార్టీగా మార్చేందుకు రెడీ అయ్యారని వినికిడి.

`తెలంగాణ జాగృతి పార్టీ`(టీజేపీ)గా దాదాపు కొత్త పార్టీ పేరు నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన వివాదాలు రాకుండా కూడా చూసుకుంటున్నారు. ఒక‌వైపు జ‌న జాగృతి పేరుతో ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూనే.. వ‌చ్చే ఆరు మాసాల్లో పార్టీ రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాన్ని కూడా పూర్తి చేయించేందుకు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందు నుంచే పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నున్నారు. మొత్తంగా.. క‌విత ప‌క్కా ప్లాన్‌తోనే ఉన్నార‌ని.. రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.