ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లోనేకాదు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ పడలేనన్నారు. పార్టీ కార్యకర్తగా ఉండేందుకే తాను ఇష్టపడతానని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నానని.. తనకు ఇది చాలని సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. వచ్చే ఐదారేళ్ల తర్వాత.. ఏం జరుగుతుందో చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే చిటికెలో పని అన్న ఆయన.. కానీ, తానే స్వయంగా విరమించుకున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలన్న ఉద్దేశం లేదన్నారు. కానీ, ఐదారేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. “జనసేన ప్రధాన కార్యదర్శి కంటే పార్టీ కార్యకర్తగా పిలిపించుకోవడమే నాకు ఇష్టం“ అని నాగబాబు వ్యాఖ్యానించారు.
వాస్తవానికి నాగబాబు 2024 పార్లమెంటు ఎన్నికల్లో అనకాపల్లినియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంది. దీనికి ఆయన మానసికంగా, రాజకీయంగా కూడా సిద్ధమయ్యారు. నిరంతరం ప్రజలను కలుసుకున్నారు స్థానిక సమస్యలు కూడా తెలుసుకున్నారు. కానీ, కూటమి పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. ఈ పార్టీ తరఫున సీఎం రమేష్ విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. నాగబాబు చూపు శ్రీకాకుళం పార్లమెంటు స్థానంపై పడిందన్న చర్చ జరిగింది.
దీనికి రీజన్.. గత ఏడాది కాలంగా ఆయన 12 సార్లు శ్రీకాకుళంలో పర్యటించారు. తాజాగా కూడా ఆయన శ్రీకాకుళంలోనే ఉన్నారు. అయితే.. ఈ సీటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిది కావడం.. ఆయన కూటమి పార్టీ టీడీపీకి వీరవిధేయుడు కావడంతో వివాదం రేగింది. తాజాగా నాగబాబు ప్రకటనతో అంతా శాంతించినట్టు అయింది. ఇక, చంద్రబాబు మంత్రి వర్గంలో నాగబాబుకు చోటు కల్పించే వ్యవహారం పెండింగులో పడిన విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates