ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి, నటసింహం బాలయ్య గారాలపట్టి నారా బ్రాహ్మణి అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో `అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపార వేత్త` అవార్డును ఆమె అందుకున్నారు. మహారాష్ట్ర రాజధాని దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వాణిజ్య పత్రిక `బిజినెస్ టుడే` ఈ అవార్డును అందించింది. ప్రస్తుతం బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
2025-26 సంవత్సరానికి గాను అత్యంత ప్రభావావంతమైన వ్యాపార దిగ్గజంగా నారా బ్రాహ్మణి గుర్తింపు పొందారు. వాస్తవానికి ఏటా ఈ పురస్కారాలను అందిస్తారు. ఈ ఏడాది కూడా సుమారు 22 మంది వ్యాపార వేత్తలుగా రాణిస్తున్న మహిళలు పోటీలో ఉన్నారు. వారందరిలోకీ.. నారా బ్రాహ్మణి అత్యుత్తమ వ్యాపార వేత్తగా నిలిచారు.
ఈ అవార్డు లభించడం పట్ల నారా బ్రాహ్మణి స్పందిస్తూ.. ఈ గుర్తింపు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. శాశ్వతంగా నిలిచే సంస్థలను ఏర్పాటు చేయడం, బాధ్యతాయుత నైతిక విలువలకు కట్టుబడి ఉండడం, ప్రజలను శక్తిమంతం చేయడమే.. నాయకత్వ లక్షణాలుగా ఆమె పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార వేత్తలను గుర్తించి ప్రోత్సహిస్తున్న `బిజినెస్ టుడే` పత్రికకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా.. గతంలోనూ బ్రాహ్మణి పలు అవార్డులు అందుకున్నారు. వ్యాపార వేత్తగానే కాకుండా.. సామాజిక చైతన్యం నింపే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో ఆమెను అవార్డులు వరించాయి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టులో బోర్డు మెంబర్‌గా ఉన్న బ్రాహ్మణి.. వారానికి ఒక రోజును ఆసుపత్రిలో సేవలకు కేటాయిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates