అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని నియ‌మించిన సీఎం చంద్ర‌బాబు.. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికి మూడు సార్లు రైతుల‌తో కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, మంత్రి నారాయ‌ణ‌ల నేతృత్వంలోని క‌మిటీ భేటీ అయింది. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామీలు కూడా ఇచ్చింది. దీంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఇవీ స‌మ‌స్య‌లు-ప‌రిష్కారాలు..

+ గ‌తంలో రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల‌కు కేటాయించిన ప్లాట్ల‌ను చూపించ‌లేద‌న్న వాద‌న ఉంది. దీనికి త్రిస‌భ్య క‌మిటీ ప‌రిష్కారం చూపించింది. కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే చూపించ‌లేదని.. మిగిలిన వారికి ప్లాట్ల‌ను ఎలాట్ చేసింది.

+ భూ స‌మీక‌ర‌ణ చేయ‌ని ప్రాంతాల్లో కూడా రైతుల‌కు ప్లాట్లు కేటాయించారు. దీనిపై రైతులు ఆవేద‌న వ్యక్తం చేశారు. తాజాగా ఈ స‌మ‌స్య‌కు కూడా ప‌రిష్కారం చూపారు. భూ స‌మీక‌ర‌ణ త్వ‌ర‌లోనే పూర్త‌వుతుందని.. ఒక వేళ భూస‌మీక‌ర‌ణ చేయ‌ని ప‌క్షంలో సేక‌ర‌ణ ద్వారా అయినా.. భూములు తీసుకుని.. రైతుల‌కు ప్లాట్లు కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు.

+ ప్లాట్ల రిజ‌ర్వేష‌న్లపైనా రైతులు ఆందోళ‌న‌గా ఉన్నారు. దీనికి కూడా ప‌రిష్కారం చూపిన త్రిస‌భ్య క‌మిటీ.. 7 వేల మంది రైతుల‌కు సంబంధించి మాత్ర‌మే రిజిస్ట్రేష‌న్ పెండింగులో ఉంద‌ని..మిగిలిన వారికి రిజిస్ట్రేష‌న్ చేస్తున్న‌ట్టు చెప్పారు. దీనికి సంబందించి స్లాట్లు బుకింగ్ ప్రారంభించామ‌న్నారు.

+ రాజ‌ధాని రైతుల ప‌రిష్కారానికి 24/7 అందుబాటులో ఉండేలా కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు. రైతులు ఎప్పుడు ఏ స‌మ‌స్య‌పై వ‌చ్చినా.. వారి నుంచి విన్న‌పాలు తీసుకుంటారు. గ‌రిష్ఠంగా మూడు రోజుల్లోనే వాటిని ప‌రిష్క‌రిస్తారు.

+ జ‌రీబు, లంక భూముల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నెల రోజుల టైమ్‌ పెట్టారు. నెల రోజుల్లో వాటిని కూడా ప‌రిష్క‌రిస్తామ‌ని క‌మిటీ హామీ ఇచ్చింది.

+ ముఖ్యంగా వాస్తు ప్ర‌కారం.. అనుకూలంగా ఉండే భూములు కేటాయించాల‌ని రైతులు కోర‌గా.. అది సాధ్యం కాద‌ని క‌మిటీ తేల్చేసింది. వాస్తు ప్ర‌కారం భూములుకేటాయించ‌లేమ‌ని .. ఈ స‌మ‌స్య‌ను ప‌క్క‌న పెట్టాలని తేల్చి చెప్పింది. మొత్తంగా.. అమ‌రావ‌తి రైతులు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న స‌మ‌స్య‌ల‌ను త్రిస‌భ్య క‌మిటీ దాదాపు ప‌రిష్క‌రించింది.