ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక బృందంతో కలిసి జరిగిన ఈ సమావేశంలో ఆయన ఉదారంగా బహుమతులు ప్రకటించారు.
ప్రతి క్రికెటర్‌కు రూ.5 లక్షలు, ప్రతి కోచ్‌కు రూ.2 లక్షలు చొప్పున మొత్తం రూ.84 లక్షల చెక్కులను అందజేశారు. అదనంగా పట్టు చీరలు, శాలువాలు, జ్ఞాపికలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ ప్యాక్‌లు అందించి వారికి ఘన సన్మానం చేశారు.
మహిళా అంధ క్రికెటర్ల విజయం దేశానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న అవసరాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా వివరించి, వారి సహకారం పొందేందుకు తానుండే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రికెటర్లు తెలిపిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెంటనే తీసుకువెళ్తానని చెప్పారు. ప్రపంచ కప్ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపిక (కెప్టెన్), పాంగి కరుణ కుమారి ఉండటం ఆనందకరమని తెలిపారు.
ఈ సందర్భంగా కెప్టెన్ దీపిక తమ గ్రామ సమస్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా హేమావతి పంచాయతీ తంబలహట్టి తండాకు రహదారి అవసరం ఉన్నట్లు ఆమె విజ్ఞప్తి చేయగా, తక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కరుణ కుమారి తెలిపిన సమస్యల పరిష్కారానికి కూడా వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates















