తను కూడా ముఖమంత్రి అవుతానంటున్న కవిత

బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు.. క‌విత షాకింగ్ కామెంట్లు చేశారు. బీఆర్ ఎస్ నాయ‌కుల‌ను గుంట‌న‌క్క‌లతో పోల్చిన క‌విత‌.. త‌న‌ను అన‌వ‌స‌రంగా విమ‌ర్శిస్తున్నార‌ని.. త‌న‌పై ఉత్తిపుణ్యానికే ఆరోప‌ణ‌లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఏదో ఒక రోజు ముఖ్య‌మంత్రిని అవుతాన‌ని వ్యాఖ్యానించారు. ఆ స‌మ‌యంలో వీరి అవినీతి చిట్టాను బ‌య‌ట‌కు తీస్తాన‌ని చెప్పారు. అంతేకాదు.. క‌విత అక్క‌డితో ఆగ‌లేదు. 2014 నుంచి రాష్ట్రంలో జ‌రిగిన పాల‌న‌(కేసీఆర్‌)పైనా విచార‌ణ చేయిస్తాన‌ని హెచ్చ‌రించారు.

ఈ వ్యాఖ్య‌లు తీవ్రంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం జ‌న జాగృతి యాత్ర చేస్తున్న క‌విత‌.. తొలినాళ్ల‌లో మాత్రం సైలెంట్‌గా త‌న‌పని తాను చేసుకున్నారు. కానీ, మైలేజీ కోస‌మో.. లేక‌.. గుర్తింపు కోస‌మో తెలియ‌దు కానీ.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే హ‌రీష్‌రావు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పైనా ఆమె నోరు చేసుకున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వేచి చూసిన బీఆర్ఎస్ నాయ‌కులు కూడా తాజాగా క‌విత‌పై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే క‌విత మీడియాతో మాట్లాడారు. నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా మొత్తం విప్పుతా. గుంటనక్కల్లాంటి వారిని వదిలిపెట్టను అని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. త‌న‌ను కాంగ్రెస్‌తో చేతులుక‌లిపారంటూ.. చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె నిప్పులు చెరిగారు. దీనికి ఆధారాలు ఉన్నాయా? అని నిల‌దీశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది కొంతేన‌ని.. త్వ‌ర‌లోనే అస‌లు టెస్టు మ్యాచ్ చూపిస్తాన‌ని పేర్కొన్నారు.

`నేను కూడా ఏదో ఒక‌రోజు ముఖ్య‌మంత్రిని అవుతా. అప్పుడు 2014 నుంచి జ‌రిగిన అవినీతి.. అక్ర‌మాల‌పై విచార‌ణ చేయిస్తా. ఆడపిల్ల కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారేమో.. ఒక్కొక్కరి తోలు తీస్తా. 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపైనా విచారణ జరిపిస్తా“ అని క‌విత తీవ్రంగా స్పందించారు. కాగా.. తెలంగాణ ఉద్యమ సమ‌యంలో చాలా మందిని బెదిరించి సొమ్ములు గుంజార‌ని కూడా క‌విత ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.