శభాష్ లోకేష్… ఇది కదా స్పీడ్ అంటే

విశాఖపట్నం ఐటీ మ్యాప్‌పై మరింత బలంగా నిలవడానికి మరో భారీ అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్‌ హిల్–2లోని మహతి ఫిన్‌టెక్‌ భవనంలో కాగ్నిజెంట్ వెయ్యి సీట్ల సామర్థ్యంతో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఇది విశాఖ ఐటీ రంగానికి నూతన దశను తెరలేపుతుందని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

దావోస్ పర్యటన ఫలితం ఏమిటి అన్న విమర్శలకు ఇదే సమాధానం అంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. జనవరి 23న దావోస్‌లో కాగ్నిజెంట్ సీఈఓతో మంత్రి నారా లోకేష్ సమావేశం కావడం, ఆ తర్వాత జూన్ 25న కంపెనీ విశాఖలో పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం… డిసెంబర్ 12న కార్యకలాపాలను ప్రారంభించడం—ఇది పాలనలో పనితీరు, వేగం ఏంటో నిరూపిస్తోందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

లోకేష్ చేతుల మీదుగా క్యాంపస్ ప్రారంభోత్సవం నిర్వహించగా, ఉద్యోగార్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఇంత వేగంగా నిర్ణయాలు, అమలు జరుగడం వల్లే అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులవుతున్నాయి అని అధికారులు వెల్లడించారు. ఇది కేవలం మొదటి దశ మాత్రమే. శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన జరుగుతోంది. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. పరోక్షంగా మరిన్ని వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో కాగ్నిజెంట్‌తో పాటు సత్వా గ్రూప్‌, ఇంకా మరో ఏడు ఐటీ సంస్థల ప్రాజెక్టులకు కూడా భూమిపూజ జరగనుంది. ఇవి అమల్లోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఐటీ శక్తికేంద్రంగా ఎదగనున్నట్లు భావిస్తున్నారు.

రుషికొండ హిల్–2లో శ్రీటెక్‌ తమ్మిన ఏఐ టెక్నాలజీ సెంటర్‌ కూడా ఏర్పాటుకానుంది. ఈ కేంద్రంలో 2,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. హిల్–4లో సత్వా డెవలపర్స్‌ భారీ ఐటీ స్పేస్‌, డేటా సెంటర్‌, వాంటేజ్‌ వైజాగ్‌ క్యాంపస్‌ను నిర్మించనుంది. బెంగళూరుకు చెందిన ఈ రియల్ ఎస్టేట్‌ దిగ్గజం విశాఖలో తమ తొలి ఐటీ ప్రాజెక్ట్‌ను వేగంగా అమలు చేయడానికి సిద్ధమైంది.

కాపులుప్పాడలో ఇమ్మాజినోటివ్‌, ఫ్లూయెంట్‌గ్రిడ్‌, మదర్‌సన్‌ టెక్నాలజీస్‌, క్వార్క్స్‌ టెక్నోసాఫ్ట్‌ వంటి ప్రముఖ సంస్థలు తమ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లను ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తుండటం విశాఖలో ఐటీ వాతావరణం ఎంత బలపడుతుందో సూచిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు, కొత్త పెట్టుబడుల పెరుగుదల… ఇవన్నీ కలిసి విశాఖను దేశంలోనే వేగంగా ఎదుగుతున్న ఐటీ నగరాల్లో ఒకటిగా మార్చనున్నాయి. “స్పీడ్ అంటే ఇదే!” అని కూటమి నేతలు చెబుతున్న దానికి ఈ పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ.