ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. నాడియాలోని కృష్ణనగర్‌లో గురువారం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ సమావేశంలో ఆమె బీజేపీ, ఎన్నికల కమిషన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష ఓటర్ల పేర్లు పెద్ద ఎత్తున తొలగించేందుకు కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ… కలెక్టర్లపై ఒత్తిడి పెంచి కోటి యాభై లక్షల పేర్లు జాబితా నుంచి తీసివేయాలని చూస్తున్నారని వెల్లడించారు. బీహార్‌లో చేసినట్టు బెంగాల్‌లో అలాంటి ప్రయత్నాలు అసాధ్యమని స్పష్టం చేశారు. ఓటర్ల పేర్లు కట్ చేస్తే మహిళలే ముందుండాలని పిలుపునిచ్చారు. “మీ హక్కులు లాక్కుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇంట్లో ఉన్న వంట సామగ్రి ఉన్నాయిగా… వాటితోనే ముందుకు వచ్చి పోరాడండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
హోంమంత్రి అమిత్ షాపై కూడా మమత విరుచుకుపడ్డారు. ఆయన రెండు కళ్లూ బెంగాల్‌కు అపశకునమని, ఒక కంటిలో దుర్యోధన, మరో కంటిలో దుశ్శాసన కనిపిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ, డిటెన్షన్ క్యాంపులు ఉండవని స్పష్టం చేసిన ఆమె… బీజేపీ ఐటీ సెల్ ప్రభావంతోనే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా తయారవుతోందని ఆరోపించారు. ఎన్నికల దగ్గర్లో ఓట్లు చీల్చే డ్రామాలు మొదలు పెడతారని, అలాంటి వాటిని ఎవరూ నమ్మకూడదని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates