కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై మంత్రి కొండా సురేఖ కొద్ది నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో నాగార్జున ఆ కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ, కేటీఆర్ పై మాత్రం న్యాయపోరాటం చేస్తానని సురేఖ అన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో కొండా సురేఖకు భారీ షాక్ తగిలింది.

కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేటీఆర్ వేసిన కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా విచారణకు కొండా సురేఖ హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. కాగా, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన క్రమంలో కొండా సురేఖను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి, మంత్రి హోదాలో ఉన్న సురేఖ ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ పై న్యాయపరంగా ఏ విధంగా ముందుకు పోతారు అన్నది ఆసక్తికరంగా మారింది.