జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అయినా, ఆ తర్వాత అయినా మాజీ సీఎం జగన్ పై ప్రధాని మోదీ నేరుగా విమర్శలు చేయలేదు.

అయితే, తాజాగా జగన్ పై కౌంటర్ అటాక్ చేయాలని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలుకు దీటుగా జవాబివ్వాలని బీజేపీ నేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు.

అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మోదీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం శుభపరిణామమని అన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకుపోతోందని అన్నారు. అంతేకాదు, చంద్రబాబు పాలనపై ఫీడ్ బ్యాక్ బాగుందని కితాబిచ్చారు.

పెట్టుబడులు ఎక్కువగా ఏపీకి వెళుతున్నాయని, అభివృద్ధికి ఇది సూచిక అని మోదీ ప్రశంసించారు. ఇక, తెలంగాణలో బీజేపీ ఎంపీలు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని మోదీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడం లేదని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారట.

జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు చురుగ్గా ఉండాలని, పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మోదీ సూచించారట. ఏపీ, తెలంగాణతో పాటు అండమాన్ కు చెందిన బీజేపీ ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారట. మరి, మోదీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమన్నా కౌంటర్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.