గత కొద్ది నెలలుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో 2021 ఫిబ్రవరిలో లోకల్ వార్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అవుతున్నారు. అయితే, కరోనాను సాకుగా చూపుతూ ఎన్నికలు వాయిదా వేయాలని జగన్ సర్కార్ సాకులు చెబుతోంది. ఎన్నికల నిర్వహణ వ్యవహారం కోర్టులో ఉండగానే ఏపీ ప్రభుత్వం మరో ఏకపక్ష నిర్ణయం విమర్శలకు తావిచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల నిర్వహణ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది.
ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం జరపదలిచిన స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమంటూ ఏపీ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలంటూ స్టే ఇవ్వడం సాధ్యం కాదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది.