బీఆర్ఎస్ పార్టీపై మరో సంచలన ట్వీట్ చేసిన కవిత

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సోదరుడు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఆమె బీఆర్ఎస్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత దీక్షా దివస్ లు.. విజయ్ దివస్ లు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పై కవిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇది ఉద్యమాల గడ్డ అని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి యూపీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపిన రోజు డిసెంబర్ 9. ఈ సందర్భంగా తెలంగాణ అంతటా విజయ్ దివస్ ను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఆనాడు కేసీఆర్ దీక్ష విరమించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కేటీఆర్, హరీష్ రావు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు తొలి అడుగుపడి నేటికి16 ఏళ్లు అని, నవంబర్ 29న దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదని, డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే కవిత వాటిపై పరోక్షంగా స్పందించి విమర్శలు గుప్పించారు.

వాస్తవానికి డిసెంబర్ 9న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు. ఆ రోజే ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ప్రకటించారు. దీంతో, తన పుట్టిన రోజు నాడు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణను సోనియా గాంధీ గిఫ్ట్ గా ఇచ్చారని ఆ క్రెడిట్ ను కాంగ్రెస్ నేతలు క్లెయిమ్ చేస్తున్నారు. దీంతో, డిసెంబర్ 9 నాడు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడూ ఏ కార్యక్రమం చేయలేదు.

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుబెట్టిన నవంబరు 29వ తేదీని మాత్రమే బీఆర్ఎస్ నేతలు దీక్షా దివస్ పేరిట పదేళ్లుగా నిర్వహిస్తున్నారు. డిసెంబరు 9 న కార్యక్రమాలు జరిపి ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్న క్రెడిట్ ఆ పార్టీ తీసుకోవడంతో బీఆర్ఎస్ కు మైలేజ్ తగ్గుతోందని, అందుకే సడెన్ గా ఈ ఏడాది విజయ్ దివస్ నిర్వహించాలని కేటీఆర్ భావించారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.