రాజకీయాల్లో ఉండుంటే చిరంజీవి తప్పక ముఖ్యమంత్రయ్యేవాడే… ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. రాజకీయాల్లో ఉండుంటే, అక్కడి నుండి పోటీ చేసుంటే.. ఇలాంటి ఊహాగానాలను ఇపుడు పవన్ ఎందుకు మొదలుపెట్టారు ? ఇన్ని సంవత్సరాల తర్వాత హఠాత్తుగా చిరంజీవి ప్రస్తావన తేవటంలో ఉద్దేశ్యం ఏమిటి ? ఏమిటంటే చాలా వ్యూహాత్మకంగానే పవన్ తన సోదరుడు, ప్రజారాజ్యంపార్టీ గురించి ప్రస్తావన తెచ్చినట్లు అనుమానంగా ఉంది.
దీనికంతటికీ కారణం ఏమిటంటే ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడి హోదాలో చిరంజీవి తిరుపతి ఎంఎల్ఏగా గెలిచిన విషయం తెలిసిందే. తర్వాత ఏకంగా పార్టీనే చాపచుట్టేసి కాంగ్రెస్ లో కలిపేశారు. తన పార్టీని విలీనం చేసినందుకు కేంద్రమంత్రి రూపంలో మంచి బహుమానమే అందుకున్నారు. పార్టీ పెట్టినందుకు, కాంగ్రెస్ లో కలిపేసినందుకు, రాజకీయాలనుండి విరమించుకున్నందుకు చిరంజీవి ఏమీ నష్టపోలేదు. మరి ఇపుడు తన సోదరునిపై పవన్ బాధ ఏమిటి ?
ఏమిటంటే తొందరలోనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నుండి తమ అభ్యర్ధిని పోటీ చేయించాలని పవన్ తెగ తాపత్రయపడిపోతున్నారు. కానీ బీజేపీ కూడా పోటీ చేసే విషయంలో చాలా పట్టుదలగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన చదలవాడ కృష్ణమూర్తికి 20 వేల ఓట్లొచ్చాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీ చేయలేదు. పొత్తుల్లో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతిచ్చిందంతే. బీఎస్పీ అభ్యర్ధి శ్రీహరిరావుకు సుమారు 24 వేల ఓట్లొచ్చాయి. ఇది తిరుపతి లోక్ సభ పరిధిలో జనసేన బలం.
తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బలిజ సామాజికవర్గం ఓట్లెక్కువ. కాబట్టి ఈ ఓట్లన్నీ జనసేన అభ్యర్ధికే పడతాయన్నది పవన్ అంచనా. ఇదే నిజమైతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బలిజల ఓట్లన్నీ ఎందుకు పడలేదని అడిగితే సమాధానం ఉండదు. ఒక ఎన్నికల్లో పడిన ఓట్లు మళ్ళీ ఎన్నికల్లో కూడా పడతాయని గ్యారెంటీ ఉండదు. మొత్తానికి బలిజలను రెచ్చగొట్టడం, ఓట్లేయించుకోవటం అనే వ్యూహంతోనే పవన్ తన సోదరుడు చిరంజీవి ప్రస్తావన తెచ్చినట్లు అర్ధమైపోతోంది.
నిజానికి చిరంజీవి అప్పట్లో గెలిచిందే కేవలం అదృష్టం మీదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి మీద జనాల్లో బాగా వ్యతిరేకతుంది. ఆ వ్యతిరేకత ఒకవైపు, చిరంజీవి ముఖ్యమంత్రి అయిపోతాడనే ప్రచారం మరోవైపు, బలిజ సామాజికవర్గం అంతా ఏకమవ్వటం ఇకోవైపు కారణంగా మాత్రమే అప్పుడు చిరంజీవి గెలిచారు. అప్పట్లో తిరుపతితో పాటు నర్సాపురంలో కూడా పోటీ చేసిన చిరంజీవి అక్కడ ఓడిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.
సొంత జిల్లాలోనే గెలవలేకపోయిన చిరంజీవి తిరుపతిలో గెలిచారంటే పైన చెప్పిన అంశాలే ప్రధాన కారణం. ఆ విషయాలన్నింటినీ మరచిపోయిన పవన్ ఇపుడు తిరుపతిలో పోటీ చేస్తే బలిజల ఓట్లన్నీ తమకే పడిపోతాయని అనుకోవటం ఉత్త భ్రమ మాత్రమే. వాస్తవాలను మరచిపోయి, గమనించకుండా ఏదో భ్రమల్లో ఉండిపోతే గాజువాక, భీమవరంలో వచ్చిన రిజల్టే రిపీట్ అవుతుందనటంలో సందేహం లేదు. మొత్తానికి ఏదో వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నట్లున్నారు. చూద్దాం ఏ మేరకు విజయం సాధిస్తారో.