ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని అభివృద్ధి చెందుతున్నాయి. అయితే.. గత 17 నెలల కాలంలో ఊహించని విధంగా ఓ నియోజ కవర్గం అభివృద్ది బాటలో దూసుకుపోతోంది. అప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. 17 మాసాల కాలంలో మాత్రం ఈ నియోజ కవర్గంపై జాతీయ స్థాయిలో చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు.. ఈ నియోజవర్గం `పథకా`లకు కేంద్రంగా కూడా మారింది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఇతర స్థానాలకు దిక్సూచిగా మారుతోంది.
అదే.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం. గత 40 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఏమాటకు మాట చెప్పాల్సి వస్తే.. ఇప్పుడు చూపిస్తున్న శ్రద్ధ.. అమలు చేస్తున్న విజన్ వంటివి గతంలో చూపించలేదనే చెప్పాలి. దీనికి పాలనాపరమైన బిజీ కావొచ్చు.. లేదా పోటీ ఉండదన్న ఆలోచన కావొచ్చు. కానీ, రోజులు మారుతున్నాయి. రాజకీయంగా కూడా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా.. తన నియోజకవర్గంపై ఎంత బిజీగా ఉన్నా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పలితంగా ఇప్పుడు అనూహ్య రీతిలో నియోజకవర్గం పరుగులు పెడుతోంది.
అభివృద్ది ఇలా..
1) మండలాల వారీగా: నియోజకవర్గంలో అభివృద్దిని మండలాల వారీగా విభజించారు. మొత్తం ఐదు మండలాలు ఉండగా.. కుప్పంను మునిసిపాలిటీగా మార్చారు. మిగిలిన నాలుగు మండలాల్లోనూ ప్రత్యేక అధికారులను నియమించారు. దీంతో కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పంలలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. వీటిని సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తున్నారు. రహదారుల నుంచి ఇతర పనుల వరకు పర్యవేక్షిస్తున్నారు.
2) కేంద్ర పథకాలకు కేంద్రం: కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవడంలో ముందున్న కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో కుప్పాన్ని వ్యూహాత్మక నియోజకవర్గంగా ఎంచుకుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ నీళ్లు ఇచ్చే పనులు ముమ్మరం చేశారు. సౌర విద్యుత్ ద్వారా.. ప్రతి ఇంటిపై సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు. రామకుప్పంలో పూర్తిగా అమలు చేశారు.
3) ఇంటికో పారిశ్రామిక వేత్త: ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేస్తామని చెబుతున్న చంద్రబాబు… శాంతిపురంలో ఈ ప్రయత్నాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ ప్రతిఇంటి నుంచి పారిశ్రామిక వేత్తను తయారు చేసేలా మహిళలకు, యువతకు శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
4) పీ-4 అమలు: తన నియోజకవర్గంలో పేదలను దత్తత తీసుకోవడం ద్వారా సీఎం పీ-4ను అమలు చేస్తున్నారు.
5) ఎన్టీఆర్ ట్రస్టు సేవలు: ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. శాంతి పురంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ మహిళలకు తర్ఫీదు ఇస్తున్నారు. అదేవిధంగా పచ్చళ్లు, అప్పడాల తయారీ.. చేనేత దుస్తుల తయారీ, హస్త కళల్లో ప్రావీణ్యం వంటి వాటిపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇలా.. కుప్పం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates