అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా మారుతుంది. మారుతున్న కాలాల్లో మారుతున్న ప్రజల అభిప్రాయాలు పార్టీలపై ఉన్న విశ్వసనీయత వంటివి పరిగణలోకి తీసుకున్నప్పుడు పాదయాత్రలు చేసి సెంటిమెంటును రాజేసి తద్వారా అధికారంలోకి రావాలి అన్న విషయంలో నాయకులకు ప్రజలు ఇటీవల కాలంలో పెద్దగా స్పందించడం లేదన్నది స్పష్టం అవుతుంది.
తాజాగా ఏపీలో మళ్లీ మరోసారి వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన పాదయాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుంది.. ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు.. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాదయాత్ర చేయాల్సిన అగత్యం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు పాదయాత్ర చేస్తే ప్రజలు దానిని అంగీకరిస్తారు. సెంటిమెంటు పవనాలు కూడా వీచే అవకాశం ఉంది. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత, ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత మళ్లీ పాదయాత్ర చేపడితే దాని ప్రభావం దాని ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు అని పరిశీలకులు చెబుతున్నారు.
ఎందుకంటే ఐదు సంవత్సరాలు అవకాశం వచ్చినప్పుడు ప్రజలను పాలించిన క్రమంలో వారికి చేరువ అయివుంటే అసలు పాదయాత్ర అనేది ఉండేది కాదని, పాలనాపరమైన లోపాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో జగన్ ఓడిపోయారని వాటిని సరిచేసుకుని కీలకమైన అంశాల్లో ప్రజలకు క్లారిటీ ఇస్తే పాదయాత్రలతో పెద్దగా పని ఉండకపోవచ్చు అని పరిశీలకు చెబుతున్నారు, ఇటీవల బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అదేవిధంగా రాజకీయ వ్యూహకర్త జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా పాదయాత్రలు చేశారు.
ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, వీరు చేసిన ప్రయత్నాలు ప్రజల్లో మార్పును కలిగించలేదు. సో ప్రజలు సెంటిమెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.. అనడానికి ఇది ఒక కీలక ఉదాహరణ. కాబట్టి వైసిపి అధినేత కూడా ముఖ్యమైన విషయాల్లో క్లారిటీ ఇస్తే సరిపోతుందని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆయన బస్సు యాత్ర చేసినా సరిపోతుంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ముఖ్యంగా వైసీపీలో జరుగుతున్న చర్చ కూడా ఇదే. మరి ఏం చేస్తారనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates