ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ప్రధాన మంత్రి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో `డ్రామాలు` చేయొద్దని.. ప్రజల సమస్యలపై చర్చించేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కొత్త తరం ఎంపీలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా కార్యక్రమాలు అమలు చేయాలని.. అరుపులు కేకలతో నినాదాలతో సభాకార్యక్రమాలకు అడ్డు తగొలద్దని కూడా ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు… ప్రతిపక్షాలకు సభలో ఎలా వ్యవహరించాలో తెలియకపోతే.. తన వద్దకు రావాలని.. తన వద్ద కొన్ని టిప్స్(ఆలోచనలు) ఉన్నాయని.. వాటిని షేర్ చేస్తానని చెప్పారు. అంతేకానీ.. సభలో మాత్రం గందరగోళం సృష్టించవద్దని చెప్పారు. అయితే.. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన పార్లమెంటు బయటే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. అసలు డ్రామా రాజకీయాలుచేసింది.. చేసేది కూడా.. మోడీనేని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలు అంటే.. ఏంటో తాము నేర్పుతామని.. నేర్చుకోవాలని మోడీకి చురకలు అంటించారు.
దేశంలో సర్ పేరుతో జరుగుతున్న ఓట్ల చోరీ.. డ్రామానా? అని ప్రశ్నించారు. దేశరాజధాని ఢిల్లీలో ప్రజలు నివసించలేకపోయినంతగా పెరిగిపోయిన కాలుష్యం డ్రామానా? అని నిలదీశారు. వీటిపై చర్చకు పట్టుబడతామని తాము ముందుగానే నిర్ణయించుకున్న విషయం తెలుసుకుని.. వాటికి సమాధానం లేకపోవడంతోనే ప్రధాన మంత్రి డ్రామా, టిప్స్ అంటూ.. వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇది ప్రధాని హోదాకు తగని వ్యాఖ్యలని ఆమె దుయ్యబట్టారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం.. ప్రతిదానినీ తనకు అనుకూలంగా మార్చుకోవడం.. ప్రధాని మోడీకి అలవాటైన `డ్రామాల`ని ప్రియాంక ఎద్దేవా చేశారు.
ఇక, మోడీ వ్యాఖ్యలపై రాజ్యసభలో విపక్ష నేత,కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు.. మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా.. ముందుగానే తన వైఖరిని ఏంటో ప్రధాని బయట పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు ప్రధాని భయపడుతున్నారని అన్నారు. దీనిని ప్రజలంతా గమనించాలని ఆయన సూచించారు. “ప్రధాని మోడీ భావిస్తున్నట్టు మేం.. ఓటమి నైరాశ్యంలో కూరుకుపోలేదు. మాది సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ. గెలుపు-ఓటములను సమానంగా తీసుకుంటాం. ఇవి కాదు ముఖ్యం. ప్రజల సమస్యలు ముఖ్యం“ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates