ఇతర రాష్ట్రాలు వద్దని గోల చేస్తున్న ‘సర్’ ప్రక్రియపై ఏపీ అధికార పార్టీ టీడీపీ సానుకూలత వ్యక్తం చేయడం.. ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా ఏపీలో సర్ ప్రక్రియను ప్రారంభించేలా కేంద్రాన్ని కోరతామని.. ఆపార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చెప్పడం విశేషం. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ద్వారా 2001కి ముందు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఆధారాలు సేకరిస్తారు. దీని ద్వారా ఓటు హక్కును నిర్ధారిస్తారు.
అనధికార, మృతి చెందిన, వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన వారి ఓట్లను జాబితాలను తొలగిస్తారు. దీనినే సర్ ప్రక్రియగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంటోంది. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే.. దీనిపై వివాదాలు కూడా ముసురుకున్నాయి. ప్రతిపక్షాల అనుకూల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా సర్ ప్రక్రియను చేపడుతున్నారన్న విమర్శలు వున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు.. ఓట్ చోరీ అంటూ నిరసనలు చేపట్టింది.
అయితే. ఈ ఆందోళనలు, నిరసనల వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి? సర్ ప్రక్రియ నిజంగానే ఓటర్ల హ క్కులను తుడిచిపెడుతోందా? అనేది సందేహమే. దీంతో ఈ ప్రక్రియ నిరాఘాటంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ సర్ ప్రక్రియను చేపట్టాలని.. టీడీపీ కోరుతుండడం గమనార్హం. ప్రస్తుతం వచ్చే ఏడాదిఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపట్టారు. తద్వారా.. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నది ఎన్నికల సంఘం వాదన.
ఏపీలో సర్ ప్రక్రియను చేపట్టడం ద్వారా.. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా మార్పులు-చేర్పులకు అవకాశం ఉంటుందన్నది టీడీపీ వ్యూహం. అందుకే… సర్ ప్రక్రియను త్వరగా చేపట్టేలా.. పార్లమెంటులో ఈ విషయాన్ని చర్చిస్తామని ఆ పార్టీ ఎంపీ లావు చెప్పుకొచ్చారు. దీనిపై పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావిస్తామన్నారు. ఇక, ఈ విషయంపై ప్రతిపక్ష వైసీపీ ఎలాంటి గళం వినిపించడం లేదు. సర్‌పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates