మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచనలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ ఎస్ ఉంటుందని.. ఆ తర్వాత ముక్కలు చెక్కలు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పార్టీలో అస్థిరత కనిపిస్తోందని చెప్పారు. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ వ్యవహార శైలి ఆ పార్టీలో నేతలకు ఎవరికీ నచ్చడం లేదని కడియం చెప్పారు. అందుకే సొంత చెల్లి కూడా బయట కు వచ్చేసిందన్నారు.
పరిస్థితులు ఏమీ బాగోలేదని చాలా మంది బీఆర్ ఎస్ నాయకులు తనతో కూడా చెబుతున్నారని కడియం వ్యాఖ్యానించారు. హరీష్‌రావు కూడా అసంతృప్తితోనే ఉన్నారని తెలిపారు. ఆయన కూడా సమయం కోసం వేచి చూస్తున్నారని.. బయటకు వచ్చేయడం ఖాయమని చెప్పారు. “కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే.. ఆతర్వాత మాత్రం పార్టీ పరిస్థితి ముక్కలు చెక్కలే. ఈ విషయం రాసిపెట్టుకోండి.“ అని కడియం అన్నారు.
నియంతృత్వ ధోరణిని ఎవరూ సహించరని పరోక్షంగా కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తనను కూడా తీవ్రంగా అవమానించారని.. అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే.. ప్రస్తుతం తన ఎమ్మెల్యే అనర్హత వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందని.. దీనిపై ఎక్కువగా మాట్లాడడం సరికాదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. కేంద్రమే సహకరించడం లేదన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ ఎస్.. ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. తూతూ మంత్రంగా పనిచేసే సరిపోదని.. బీసీలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేసు కేసు ఉందని.. అందుకే ఆయన కేంద్రాన్ని ప్రశ్నించేందుకు భయపడుతున్నారని కడియం వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తోందని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తగిన విధంగా స్పందిస్తుందని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates