బాబుకు అవ‌మానం.. గ్రేట‌ర్ టీడీపీ జీరో!

నేనే హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశాను. సైబ‌రాబాద్ వంటి మ‌హా ఐటీ సామాజ్రాన్ని ఏర్పాటు చేసిన రూప ‌శిల్పిని నేనే. నాకు త‌ప్ప‌.. ఇక్క‌డ ఓట్లు అడిగే హ‌క్కు మ‌రే ఇత‌ర పార్టీకి కూడా లేదు- అని చెప్పిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు భారీ దెబ్బే త‌గిలింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి ఘోరంగా మారిపోయింది. మొత్తం 150 డివిజ‌న్ల‌లో ఏ ఒక్క చోట కూడా పార్టీ గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయింది. నిజానికి గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లోనే ఉన్నారు.

ఆయ‌న ఆన్‌లైన్ వేదిక‌గా డివిజ‌న్లలో కార్పొరేట‌ర్ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. ఇక‌, పార్టీ తెలంగాణ‌ అధ్యక్షుడు ఎల్ ర‌మ‌ణ కూడా రాష్ట్ర పార్టీ చీఫ్‌పై త‌న స‌త్తాకు ఈ ఎన్నిక‌లు నిద‌ర్శ‌మ‌ని భావించారు. ఈ క్ర‌మం లోనే అభ్య‌ర్థుల‌ను కూడా ఆచి తూచి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు నాలుగు రోజుల ముందు.. చంద్ర‌బాబు స్వ‌యంగా ఆయా అభ్య‌ర్థుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. హైద‌రాబాద్‌ను చుట్టుముట్టిన వ‌ర‌ద‌ల విష‌యాన్ని హైలెట్ చేయాల‌ని అన్నారు. ఓటు అడిగే హ‌క్కు కూడా త‌మ‌కే ఉంద‌ని చెప్పారు.

కానీ, అనూహ్యంగా పార్టీ ఒక్క‌చోట కూడా గెలుపు గుర్రం ఎక్క‌లేక‌పోయింది. నిజానికి ఏపీ సెటిల‌ర్లు ఎక్కువగా ఉన్న కూక‌ట్ ప‌ల్లి, ఖైర‌తాబాద్‌, బంజారా హిల్స్‌, జూబ్లీ హిల్స్‌, తార‌నాక ఇలా అనేక ప్రాంతాల్లోనూ టీడీ పీ ఎక్క‌డా త‌న స‌త్తా చాట‌లేక పోయింది. మ‌రి.. ఈ ప‌రిణామం దేనికి సంకేతంగా భావించాలి? చంద్ర‌బాబు పై విశ్వాసం స‌న్న‌గిల్లింద‌ని అనుకోవాలా? లేక పార్టీని తెలంగాణ ప్ర‌జ‌లు గుర్తించ‌డం మానేశార‌ని భావించాలా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

గ‌త 2016 గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో.. సీఎం హోదాలో చంద్ర‌బాబు భారీ ప్ర‌చారం నిర్వ‌హించారు. అదేవిధంగా ఆయ‌న కుమారుడు లోకేష్ కూడా ప్ర‌చారానికి దిగారు. కానీ, ఐదేళ్లు తిరిగే స‌రికి ఇరువురూ చేతులు ఎత్తేశారు. ఉన్న అవ‌కాశాల‌ను కూడా స‌ద్వినియోగం చేసుకోలేక పోయార‌నే వాద‌న ఉంది. ఇలా.. కార‌ణాలు ఏవైనా.. మొత్తానికి భాగ్య‌న‌గ‌రంలో తెలుగుదేశం పార్టీ ఇక‌.. చ‌రిత్ర‌లో క‌లిసిపోయిన‌ట్టే!! అనే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం ఆ పార్టీ సానుభూతిప‌రుల‌కు గుండెను మెలిపెట్టిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.