జ‌న‌సేన వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌.. కాపు ఓట్ల‌పైనే గురి ..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమైన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి సంబంధించి రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేయడంతో పాటు ఆ ఓటు బ్యాంకును వైసీపీ వైపు మళ్లకుండా చూసుకునే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే సొంత ఇంటిని నిర్మించుకున్నారు.

తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. పిఠాపురంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రహదారుల నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది అయితే ఇది ఒక్కటే కాకుండా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పైన దృష్టి పెట్టాలని జనసేన భావిస్తోందిజ‌ దీనిలో భాగంగా పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక వర్గం ప్రభలంగా ఉన్న మండలాలు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన. విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు ఇతర అవసరాలను తీర్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది.

దీంతో కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడకుండా చూడాల‌న్న‌దే కీల‌క నిర్ణ‌యం. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూసిన‌ట్టుగా.. వ‌చ్చే ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు ఆపార్టీకి ద‌క్కకుండా చూడాల‌ని నిర్ణ‌యించింది. అయితే టిడిపి, లేకపోతే జనసేనకు పడేలాగా వ్యవహరిస్తున్నారు, రాజకీయాల్లో ఇటువంటి వ్యూహాలు సర్వసాధారణం, ఏ పార్టీ అయినా పైకి ఏం చెప్పినా సామాజిక వర్గాల పరంగా ఎన్నికల సమయానికి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది, కాబట్టి ఈ దశలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న కాపులను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన ప్రయత్నించటం విశేషం.

ఇప్పటికే మెజారిటీ ఓటు బ్యాంకు జనసేనకు లభించింది. ఇది మరింతగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇతర సామాజిక వర్గాల కంటే కూడా కాపులు జనసేన వైపు మళ్లేందుకు మెజారిటీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొలుత ఈ దిశగా అడుగులు వేయాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే కాపు సామాజిక వర్గం ప్రభలంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పైన దృష్టి పెట్టి కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ ఉండడం గమనార్హం.