గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత.. ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు.. అది కూడా అర్థరాత్రి వేళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులుజారీ చేయటం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ఉత్తర్వుల్లో ఏముందన్న విషయానికి వెళితే..
గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్న వాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా వాటిని సైతం ఓట్లుగా పరిగణించాలని ఎన్నికల సంఘం కోరింది. ఎందుకిలా? అంటే.. పోలింగ్ సిబ్బంది చేసిన తప్పేనని చెబుతున్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు ఓటు వేసేందుకు ఇవ్వాల్సిన స్టాంప్ స్వస్తిక్ గుర్తులో ఉంటుంది. దానికి బదులుగా.. పోలింగ్ కేంద్రం సంఖ్యను తెలిపే స్టాంప్ ను పోలింగ్ సిబ్బంది ఇచ్చినట్లుగా గుర్తించారు.
తాము చేసిన పని గురించి పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పటంతో ఈసీ అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంది. అయితే.. అర్థరాత్రి వేళలో ఉత్తర్వులు జారీ చేయటం వివాదంగా మారింది ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదని తమ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి తప్పుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే అందరిని సంప్రదించి చేస్తే బాగుండేది.
ఒకవేళ .. అది సాధ్యం కాదనుకుంటే.. ఉదయమంతా ఏం చేసినట్లు? అన్నది మరో ప్రశ్న. పొద్దునంతా ఊరుకొని.. అర్థరాత్రి వేళలో జారీ చేసిన ఉత్తర్వులతో కొత్త సందేహాలకు ఎన్నికల సంఘం తావిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై విపక్షాలుహైకోర్టును ఆశ్రయించాయి. ఆ ఉత్తర్వుల్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది.