‘ప‌ర‌కామ‌ణి’పై మ‌రింత ప‌టిష్ఠంగా.. టీటీడీ నిర్ణ‌యం

వైసీపీ హ‌యాంలో 2021-22 మ‌ధ్య కాలంలో తిరుమ‌ల శ్రీవారికి భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌ల హుండీ ప‌రకామ‌ణిలో చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ప‌ర‌కామ‌ణి సొమ్మును లెక్కించే స‌మ‌యంలో విదేశీ 70 డాల‌ర్ల‌ను అక్క‌డే ప‌నిచేస్తున్న ర‌వికుమార్ అనే సీనియ‌ర్ అసిస్టెంట్ క‌ట్ డ్రాయ‌ర్‌లో పెట్టుకుని దోచుకున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన ఏవీఎస్‌వో స‌తీశ్ కుమార్ ప‌ట్టుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం.. ఏం జ‌రిగిందో ఏమో.. ఈ ఘ‌ట‌న‌పై లోక్ అదాల‌త్‌లో రాజీ జ‌రిగింది. వెంట‌నే.. ర‌వి కుమార్ డాల‌ర్ల‌తోపాటు.. 10 కోట్ల విలువైన సొంత ఆస్తుల‌ను కూడా శ్రీవారికి ఇచ్చేశారు.

క‌ట్టేచేస్తే..కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక‌.. తిరుపతికి చెందిన స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టు ఒక‌రు దీనిపై హైకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. అప్ప‌ట్లో ఎందుకు రాజీ ప‌డ్డారో? ఎవ‌రు రాజీకి మార్గం సుగమం చేశారో తేల్చాల‌ని కోరారు. దీనిపై ప్ర‌స్తుతం సీఐడీ అధికారులు విచార‌ణ చేస్తున్నారు. ఇంత‌లోనే ఆనాడు.. నిందితుడిని గుర్తించి ప‌ట్టుకున్న స‌తీష్ కుమార్ ఇటీవ‌ల అనంతపురంలోని కోమ‌లి రైల్వే ట్రాప్‌పై విగ‌త జీవిగా క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ కేసు కూడా స‌వాలుగా మారింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ అంశంపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ప‌ర‌కామ‌ణి కేసును తిరిగ‌దోడాల‌ని.. నిర్ణ‌యించింది. అంతేకాదు.. సంస్థాగ‌తంగా తిరుమ‌ల అధికారుల‌తోనూ దీనిపై ద‌ర్యాప్తు చేయించాల‌ని నిర్ణ‌యించింది. అదేవిధంగా తిరుప‌తికి చెందిన ఓ జ‌ర్న‌లిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసినా.. బ‌ల‌మైన సెక్ష‌న్లు లేకుండా పోయాయ‌ని.. ఈ క్ర‌మంలో మ‌రింత బ‌ల‌మైన సెక్ష‌న్లు న‌మోదు చేసేలా.. పోలీసుల‌ను కోరాల‌ని కూడా పాల‌క మండ‌లి తీర్మానం చేసింది. అదేవిదంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ర‌కామ‌ణిలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకురావాల‌ని కూడా నిర్ణ‌యించింది. ప‌రకామ‌ణిలో భ‌క్తులు శ్రీవారికి స‌మ‌ర్పించే కానుక‌ల‌కు వైసీపీ హ‌యాంలో ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్న విషయాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని తీర్మానం చేశారు.

అదేవిధంగా తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ నెయ్యి క‌ల్తీ వ్య‌వ‌హారం కోర్టులో విచార‌ణ సాగుతున్నా.. ప్ర‌స్తుతం దీని నాణ్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా చేయాల‌ని నిర్ణ‌యించారు. అలానే వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఆర్జిత సేవా టికెట్ల ‘పందేరం’.. త‌ద్వారా సామాన్య భ‌క్తులు ప‌డిన ఇబ్బందుల‌ను కూడా ప్ర‌జ‌లకు వివ‌రించ‌నున్నారు. ఇక‌, అత్యంత కీల‌క‌మైన వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని మొత్తం 10 రోజ‌లు పాటు శ్రీవారి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన టోకెన్లు.. ఇత‌రత్రా వ్య‌వ‌హారాల్లో గ‌తంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు.