కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది, తాజాగా వచ్చిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ వ్యవహారం చేర్చనీయాంశంగా మారింది. గతంలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆయన గెలుపు గుర్రం ఎక్కుతామని కేంద్రంలో అధికారంలోకి వస్తామని ప్రకటించారు.
కానీ మోడీ ప్రభావం ముందు నిలవలేకపోయారు. అంతేకాదు 2014లో దక్కించుకున్న పార్లమెంటు స్థానాల కంటే కూడా 2019లో మరింత దిగజారే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటక కు చెందిన మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడు స్థానాన్ని స్వీకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగాలన్నా రాహుల్ గాంధీ ఆమోదముద్ర పడితే తప్ప జరగడం లేదన్న వాదన వినిపిస్తోంది.
నిజానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ రాహుల్ గాంధీ ఆమోదం లేకుండా ఏ చిన్న పనినీ చేయలేని పరిస్థితి ఉందన్నది వాస్తవం. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటే హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముందు దీనిని కొనసాగించే సమయంలో కూడా రాహుల్ గాంధీ ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగతంగా నాయకులు నియమించాల్సి వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ అనుమతి అవసరమని బహిరంగంగానే ప్రకటనలు చేశారు.
ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా కూడా రాహుల్ గాంధీ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. అంటే ప్రత్యక్షంగా అధ్యక్ష హోదాలో లేకపోయినప్పటికీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తాజా ఎన్నికల్లో బీహార్ లో మరింత దిగజారిపోవడం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీవ్ర స్థాయిలో ఇరుకున పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజకీయాలు సొంత పార్టీలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ఇబ్బందికి కూడా గురవుతున్నాయి.
ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీని సరైన దారిలో నడిపించలేకపోతున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాల అంచనా. కేరళకు చెందిన శశిధరూర్ తమిళనాడుకు చెందిన చిదంబరం వంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యే అవకాశం ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత దెబ్బతింటుంది.
మరి ముఖ్యంగా ఇండియా కూటమిలో పార్టీలు ఇప్పటికే చీలికలు పేలికలుగా మారాయి. భవిష్యత్తులో ఆయా పార్టీలు మరింత దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా రాహుల్ గాంధీ రాజకీయానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందన్నది స్పష్టం అవుతున్న పరిణామం.
Gulte Telugu Telugu Political and Movie News Updates