జూబ్లీహిల్స్… ఆ పార్టీ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణతో పాటు ఏపీలోనూ తీవ్ర స్థాయిలో రాజకీయ ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క స్థానంలో గెలుపు కోసం అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు ప్రయోగించాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల మధ్య అయితే ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం పోలింగ్ ముగిసింది. దీంతో, గెలుపెవరిది అని ప్రాథమిక అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ అంచనాలవైపు అందరి దృష్టి మళ్లింది.

ఈ క్రమంలోనే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ కు 46 శాతం, బీఆర్ఎస్ కు 43 శాతం, బీజేపీకి 6 శాతం ఓట్లు వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 48.3శాతం, బీఆర్ఎస్ 43.18శాతం, బీజేపీ 5.84 శాతం ఓట్లు సాధిస్తాయని హెచ్ఎంఆర్ సర్వే భావిస్తోంది. కాంగ్రెస్ 48.2శాతం, బీఆర్ఎస్ 42.1 శాతం, బీజేపీ 7.6 శాతం, ఇతరులు 2.1శాతం ఓట్లు దక్కించునే చాన్స్ ఉందని స్మార్ట్ పోల్ సర్వే అభిప్రాయపడింది.

ఇక, ఆత్మ‌సాక్షి సర్వే అంచ‌నా ప్ర‌కారం కాంగ్రెస్‌కు 46.5 శాతం, బీఆర్ఎస్‌ కు 44.5 శాతం, బీజేపీకి 6.5 శాతం ఓట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం ఓట్లు దక్కించుకునే చాన్స్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయో లేదో తేలాలంటే ఈ నెల 14 వరకు వేచి చూడక తప్పదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వీ6 ఛానెల్ తన సర్వేలో వెల్లడించింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తారని కేకే సర్వే అంచనా వేసింది.