`జగన్ అంటే జనం – జనం అంటే జగన్!` అనే మాట ఒకప్పుడు వైసీపీలో జోరుగా వినిపించేది. వచ్చాడంటే వస్తారంతే.. అంటూ భారీ ఎత్తున తరలివచ్చిన జనాలను చూపించిన వైసిపి విషయం అందరికీ తెలిసిందే. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ జనంలో విపరీతమైన ఇమేజ్ ఉందని చెప్పుకునేవారు. జగన్ వస్తున్నాడు అంటే జనం తండోపతండాలుగా తరలివస్తున్నారంటూ ప్రత్యేక కథనాలను కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉండేది.
కానీ ఇప్పుడు కారణాలు ఏమైనా గత 16 మాసాల్లో జనంలో జగన్ ఉండడం లేదన్నది వాస్తవం. ఏదో తరచుగా ఒకటి రెండు కార్యక్రమాలు నిర్వహించడం వరకు సరిపెడుతున్నారు. ఏదైనా ఉంటే తప్ప ఆయన బయటకు రావడం లేదు. కానీ వాస్తవానికి ప్రతిరోజు ప్రతినిత్యం పార్టీ ఏదైనా కార్యక్రమాలు చేయాలి అంటే అనేక ప్రణాళికలు ఉంటాయి. అనేక విధమైన సమస్యలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పక్కనపెట్టి కేవలం ఎప్పుడో విజిటింగ్ నాయకుడిగా జగన్ ప్రజల్లోకి వస్తున్నారు.
ఆ సమయంలో జనం భారీ ఎత్తున తరలివస్తున్నారు అన్నది వైసీపీ చెబుతున్న మాట. కానీ, ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించి చేసుకున్న జన సమీకరణ కొన్ని కొన్ని చోట్ల బెడిసి కొట్టింది అనేది వైసిపి లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఈ విషయాన్ని పక్కన పెడితే.. అసలు జగన్ జనంలో ఉంటే వచ్చే ఇమేజ్ కి, జనాన్ని తరలిస్తే వచ్చే ఇమేజ్ కి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందని తాజాగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకప్పుడు జగన్ జనంలో ఉన్నప్పుడు ఆయనకు నిజంగానే జనం తరలివచ్చిన మాట వాస్తవం.
కానీ, ఇప్పుడు జనంలోకి రావడం మానేసి కేవలం తాడేపల్లి బెంగళూరు చుట్టూ ఆయన తిరుగుతున్నారు. ఏదైనా సందర్భం ఉంటే మాత్రమే ప్రజల మధ్యకు వస్తున్నారు. ఇది సరికాదు అన్నది ఇప్పుడు వైసీపీలో నాయకులు చెబుతున్న మాట. తరచుగా జనాల మధ్యకు రావాలని వారిని పలకరించడం ద్వారా వారి సమస్యలను ప్రస్తావించడం ద్వారా జగన్ ప్రజలకు చేరువ కావాలని చెబుతున్నారు. అదేవిధంగా ప్రజాదర్బార్లు నిర్వహించడం ద్వారా మరింతగా ప్రజలకు చేరువ కావచ్చని వారు సూచిస్తున్నారు. ఏదేమైనా జనంలో ఉంటేనే జగన్కు ఇమేజ్ పెరుగుతుంది అన్నది వైసిపి నేతల దృఢ నిర్ణయం. మరి దీన్ని జగన్ ఎలా అర్థం చేసుకుంటారు ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates