కేసీఆర్ కాళ్లు పట్టుకుంటే జూబ్లీహిల్స్ మీదే: కేటీఆర్

జూబ్లీహిల్స్ బై పోల్ దంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల యుద్ధ పీక్స్ కు చేరింది. దివంగత మాగంటి గోపీనాథ్ మృతికి కేటీఆర్ కారణమని ఆరోపణలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దుమారం రేపింది. మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ఈ ఉప ఎన్నిక ప్రచారంలోకి లాగడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఇంత చిల్లర రాజకీయం చేయనవసరం లేదని, కేసీఆర్ కాళ్లు మొక్కితే ఆ సీటు వదిలేస్తారని కేటీఆర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

మాగంటి గోపీనాథ్ మరణంపై ఇంత నీచమైన రాజకీయం చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్, సునీతలకు ముగ్గురు పిల్లలున్నారని….ఇప్పుడు గోపీనాథ్ భార్య సునీత కాదని కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపీనాథ్ తల్లి ఇంకొకలా మాట్లాడుతున్నారని, ఇద్దరు మంత్రులు దుర్మార్గంగా సునీత కన్నీళ్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇంకొకరు వాళ్ల పిల్లల మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఒక్క ఎలక్షన్ గెలిచేందుకు ఇంత దిగజారి రాజకీయం చేయాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. అడుక్కుంటే, కేసీఆర్ కాళ్ల మీద పడితే ఆయనే ఆ సీటు ఇస్తాడని, ఆ ఎలక్షన్ ఏకగ్రీవం చేసుకోండి అని కేటీఆర్ చెప్పారు. ఈ రోజుకైనా సీటు కావాలనుకుంటే కేసీఆర్ కాళ్లు పట్టుకోమనండి ఇస్తారు అని అన్నారు. ఒక సీటు కోసం ఇంత నీచమైన రాజకీయం అవసరమా అని కేటీఆర్ నిలదీశారు.