2.5 కోట్ల రూపాయ‌లు-భూమి-ఉద్యోగం: శ్రీచ‌రణికి ఏపీ కానుక‌!

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ శ్రీచ‌ర‌ణికి సీఎం చంద్ర‌బాబు భారీ కానుక ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉమెన్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకున్న టీంలో ఏపీకి చెందిన శ్రీచ‌రణి కూడా ఉన్నారు. ఆమె క‌డ‌ప జిల్లాకు చెం దిన వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్‌. ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్స్‌లో చెల‌రేగి ఆడిన క్రీడాకారిణి గా కూడా గుర్తింపు పొందారు. తాజాగా ఏపీకి వ‌చ్చిన ఆమె.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ల‌ను క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా శ్రీచ‌ర‌ణిని అభినందించి.. భావిష్య‌త్తులో మ‌రిన్ని ప‌త‌కాలు సాధించాల‌ని ఆశీర్వ‌దించిన సీఎం చంద్ర‌బాబు.. ఆమెకు కానుక‌గా 2.5 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. అదేవిధంగా త‌మ‌కు ఇల్లు లేద‌ని చెప్ప‌డంతో ఆ వెంట‌నే ఆయన ఇంటిస్థ‌లాన్ని మంజూరు చేయాల‌ని అక్క‌డిక‌క్క‌డే క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్కు ఫోన్ చేసి ఆదేశించారు. అంతేకాదు.. గ్రూప్ -1 పోస్టు కింద డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగాన్ని కూడా ఆఫ‌ర్ చేశారు.

అయితే.. క్రికెట్ పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని, రాష్ట్రం పేరును ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లాల‌ని సూచించారు. రాష్ట్రానికి చెందిన బ్యాడ్‌మింట‌న్ క్రీడాకారిణి సింధు.. తాజాగా చ‌ర‌ణి వంటి వారు.. దేశాన్ని ప్ర‌పంచ స్థాయిలో నిల‌బెడుతున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. కాగా.. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణి మాట్లాడుతూ.. త‌న ప్రాధాన్యం క్రికిట్టేన‌ని తెలిపారు. భవిష్య‌త్తులో చాలా సాధించాల్సి ఉంద‌న్నారు.

చంద్ర‌బాబు మంచి ప్రోత్సాహం అందించార‌ని చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ త‌న‌ను తీర్చిదిద్దింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. త‌న తండ్రి స్ఫూర్తితో తాను క్రికెట్‌ను ఎంచుకున్న‌ట్టు తెలిపారు. చిన్న‌ప్పు డు.. త‌న తండ్రి క్రికెట్‌ను ఎంతగానో ప్రోత్స‌హించార‌ని వివ‌రించారు.