రజనీ కన్నా పవనే నయమా ?

రాజకీయ పార్టీ పెట్టడంలో తమిళనాడులో రజనీకాంత్ తో పోల్చుకుంటే మన జనసేనాని పవన్ కల్యాణ్ నూరుశాతం నయమని అనిపిస్తోంది. పవన్ తో పోల్చుకుంటే రజనీకి తమిళనాడులో కోట్లాదిమంది అభిమానులున్నారు. రజనీ ఏమి చెబితే దాన్ని గుడ్డిగా అభిమానించి, ఫాలో అయిపోయే అభిమానులు రజనీ సొంతం. అలాంటిది రాజకీయ పార్టీ పెట్టే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఇన్ని సంవత్సరాల గడువు ఎందుకు తీసుకుంటున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఇదిగో పార్టీ పెట్టేయబోతున్నాడని ఒకసారి.. లేదు లేదు ఇఫ్పట్లో పార్టీ పెట్టే ఆలోచన లేదని మరొకసారి ఇలాగే సంవత్సరాలు గడచిపోతున్నాయి కానీ రజనీకాంత్ నోటివెంట మాత్రం ఏ విషయం స్పష్టంగా బయటకు రావటం లేదు. నిజానికి రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని తమిళనాడులో ఎవరు కోరుకోలేదు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పడని కారణంగా రజనీయే కొన్ని రాజకీయ ప్రకటనలు చేశారు. దాంతో రజనీకి పాలిటిక్స్ లోకి ఎంటరయ్యే ఇంట్రస్టుందని అందరికీ అర్ధమైంది.

అప్పటి నుండి పార్టీ పెట్టే విషయంలో చాలాసార్లు రజనీ తన అభిమాన సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తునే ఉన్నారు. తాజాగా సోమవారం కూడా చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో భారీ సమావేశం నిర్వహించారు. ఇంకేముంది పాలిటిక్స్ లో ఎంట్రీపై ఏదో విషయం తేల్చేస్తారని యావత్ రాష్ట్రమంతా ఎదురు చూసింది. కానీ ఎప్పటి లాగే నాన్నా పులి కథలో లాగ నిర్ణయం వాయిదా పడింది. తన నిర్ణయం చెప్పటానికి రజనీ మరో రెండు రోజులు సమయం తీసుకుంటానని ప్రకటించారు.

రాజకీయాల్లో ఎంట్రీ విషయంలో ఏ విషయం చెప్పటానికి రజనీ జనాలను ఊరించి ఊరించి సస్పెన్సులో ముంచేయటం అభిమాన సంఘాలకే నచ్చినట్లు లేదు. అందుకనే పొలిటికల్ ఎంట్రీపై ఏదో విషయం తేల్చి చెప్పమని గట్టిగానే అడిగినట్లున్నారు. నిర్ణయం తీసుకోకుండా బీజేపీకి ఓట్లేయమని, బీజేపీతో కలుస్తానంటే కుదరదని కూడా అభిమాన సంఘాల నేతలు స్పష్టం చేశారట. ఈ విషయాన్ని గమనిస్తే రజనీ కన్నా మన పవర్ స్టారే నయమనిపిస్తోంది. రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకోగానే ప్రకటించేశారు. పార్టీ పెట్టిన కొత్తల్లో పవన్ రాష్ట్రంలో హల్ చల్ సృష్టించేశారు. సరే తర్వాత ఏమి జరిగిందన్నది వేరే విషయం.