ఈ ఫోటోని ఇప్పుడు ఎందుకు వదిలేరు?

ప్ర‌స్తుతం ఏదీ దాగ‌దు.. సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ పుల్‌గా ఉంది.. ప్ర‌ధాన మీడియా అయితే.. విస్తృతంగా ఉంద‌ని చెప్పుకొంటాం క‌దా!. కానీ.. కొన్ని కొన్ని కీల‌క విష‌యాలు ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రు బ‌య‌ట పెడితే త‌ప్ప తెలియ‌డం లేదు. తాజాగా ఇలాంటి ‘షాకింగ్ న్యూస్‌’ ఒక‌టి.. సీఎం రేవంత్ రెడ్డి సోద‌రుడు కొండ‌ల్ రెడ్డి స్వ‌యంగా బ‌య‌ట‌కు వెల్ల‌డిస్తే.. త‌ప్ప‌.. వెలుగు చూడ‌లేదు. అంతేకాదు.. ఇది తెలిసిన త‌ర్వాత‌.. అంద‌రూ అవాక్క‌య్యారు. అయ్యో.. ఎలా మిస్స‌య్యాం! అంటూ.. నాలిక క‌రుచుకున్నారు.

విష‌యం ఏంటి?

బాలీవుడ్ హీరో.. స‌ల్మాన్ ఖాన్ ను సీఎం రేవంత్ రెడ్డి క‌లుసుకున్నారు. ముంబైలోని ఆయ‌న నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. స్వ‌యంగా స‌ల్మాన్‌ను క‌లిసి.. ఆయ‌న‌తో ఫొటోలు కూడా దిగారు. అయితే.. ఈ విష‌యం.. రేవంత్ సోద‌రుడు కొండ‌ల్ రెడ్డి త‌న సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసే వర‌కు ఎవ‌రికీ తెలియ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఈ పోస్టు ఇలా పెట్ట‌గానే అలా జోరుగా వైర‌ల్ అయింది. సాధార‌ణంగా.. ముఖ్య‌మంత్రిస్థాయిలో ఉన్న‌వారు.. త‌మ వ‌ద్ద‌కు మిగిలిన వారిని ర‌ప్పించుకుంటారు.

కానీ, రేవంత్ రెడ్డి మాత్రం.. త‌నే స్వ‌యంగా స‌ల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్ల‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. అయితే.. ఈ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చాక‌..అస‌లు సీఎం రేవంత్ ముంబై ఎప్పుడు వెళ్లారు? స‌ల్మాన్ ఖాన్‌ను ఎప్పుడు క‌లిశారు? వీరి మ‌ధ్య ఎవ‌రు భేటీ కుదిర్చారు? ఇలానే అనేక ధ‌ర్మ సందేహాలు వెలుగు చూశాయి. అదేస‌మ‌యంలో ఈ ఫొటోను కొండ‌ల్ రెడ్డి బ‌య‌ట‌కు తీసుకురావ‌డం పోస్టు చేయ‌డం వంటివి కూడా ఆస‌క్తిగా మారాయి. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్ అనే చెప్పారు.

దీనికి కొండ‌ల్ రెడ్డి ఇచ్చిన స‌మాధానం.. “రైజింగ్ తెలంగాణ‌ను ప్ర‌పంచ‌స్థాయిలో నిల‌బెట్ట‌డానికి ఇద్ద‌రు ఐకాన్స్‌.. ఒక విజ‌న్‌” అని పేర్కొన్నారు. వీరిద్ద‌రూ తెలంగాణను ముందుకు తీసుకువెళ్లేందుకు.. విశ్వ న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను, ప్ర‌పంచ‌స్థాయిలో రాష్ట్రాన్ని నిల‌బెట్టేందుకు కృషి చేస్తారు.. అని తెలిపారు. ఇదిలావుంటే.. ఈ ఫొటో వ్య‌వ‌హారంపై బీఆర్ఎస్ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇవ‌న్నీ.. జూబ్లీహిల్స్ ఉప పోరు నేప‌థ్యంలో ముస్లిం ఓటు బ్యాంకును ప్లీజింగ్ చేసుకునేందుకేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.