ఈ ఏపీ లీడ‌ర్లు ఆ మెజారిటీని నిల‌బెట్టుకుంటే చాలు ..!

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందికి 30-50 వేల ఓట్ల మెజారిటీ ల‌భించింది. ఈ మెజారిటీని నిల‌బెట్టుకుంటున్నారా? లేదా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌జల్లో వ‌చ్చే భావోద్వేగాలు కీల‌క రోల్ పోషిస్తున్నాయి. దీంతో పార్టీల‌కు పార్టీల‌ను ఓట‌ర్లు ప‌క్క‌న పెడుతున్నారు. స‌హ‌జంగా ఒక‌ప్పుడు ఓడిన పార్టీకి కూడా గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానాలు ద‌క్కేవి. కానీ, ఏపీలో ప‌రిస్థితి దీనికి భిన్నంగా మారుతోంది. ఓడిపోయిన పార్టీల‌కు ప్ర‌జ‌లు త‌క్కువ సంఖ్య‌లో సీట్లు క‌ట్ట‌బెడుతున్నారు.

ఇక‌, గెలుపు గుర్రం ఎక్కుతున్న నాయ‌కుల‌కు కూడా ఊహించ‌ని విధంగా ప్ర‌జ‌లు మెజారిటీని క‌ట్ట‌బెడుతున్నారు. అదే స‌మ‌యంలో ఓడిపోయిన వారికి చాలా చాలా త‌క్కువ ఓట్లు ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఓట‌రు నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో ప్ర‌ఖ్యాత సంస్థ‌లు కూడా ఒకింత డోలాయ‌మానంలో ఉన్నాయి. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎవ‌రు ఓడుతారు.. ఎవ‌రు గెలుస్తారు? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు.. త‌మ మెజారిటీని నిల‌బెట్టుకుంటే చాల‌న్న వాద‌న వినిపిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప సంఖ్య‌లోనే త‌క్కువ మెజారిటీ ద‌క్కించుకున్నవారు ఉన్నారు. కానీ, మెజారిటీ ఎమ్మెల్యేల‌కు 30 వేల నుంచి 50 వేల ఓట్ల వ‌ర‌కు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ రేంజ్‌ను వారు నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తే చాల‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. “ఎమ్మెల్యేలు కొత్త ఓట‌ర్ల కోసం ప్ర‌య‌త్నించాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఎవ‌రైతే త‌మ‌ను న‌మ్మి ఓటేశారో.. వారిని నిల‌బెట్టుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం పెద్ద‌క‌ష్టం కాదు” అని ఓ విశ్లేష‌కుడు వ్యాఖ్యానించారు.

ఇక‌, దీంతోపాటు.. వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పొర‌పాట్ల‌కు దూరంగా ఉండాల‌న్న సూచ‌న‌లు కూడా వ‌స్తున్నాయి. “ఇప్పుడు గెలిచిన వారికి.. తాము ఎందుకు గెలిచామో.. తెలుసు క‌దా!. ప్ర‌త్య‌ర్థి ఎందుకు ఓడిపోయారో కూడా వీరికి అవ‌గాహ‌న ఉంటుంది. సో.. దీనిని అంచ‌నా వేసుకుంటే.. వారు ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విష‌యాలు స్ప‌ష్ట‌మ‌వుతాయి. దీనికి ప్ర‌త్యేకంగా వారు కృషి చేయాల్సిన అవ‌స‌రం లేదు.” అని గ‌త అనుభ‌వాల‌ను తెలుసుకుని.. ఆ త‌ప్పులు చేయ‌కుండా ఉంటేచాల‌ని అంటున్నారు.